శ్రీశైల దేవస్థానం:శుక్రవారం ఉదయానికి త్రయోదశి ఘడియలు రావడంతో దేవస్థానం నందీశ్వరస్వామి వారికి విశేషార్చన జరిపించింది ..
ప్రతి మంగళవారం , త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం వుంటుంది. ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో ఈ విశేషపూజలు నిర్వహించారు.
ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చక స్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పారు.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకుమహాగణపతిపూజను జరిపారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం , మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం జరిపారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేశారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలను జరిపారు . అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు.
చివరగా స్వామికి నివేదన సమర్పించారు.
