శ్రీశైల దేవస్థానం:కార్తిక రెండో సోమవారం సందర్భంగా రేపు 23న పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సం, పుష్కరిణిహారతిని నిర్వహిస్తామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు. లోక కల్యాణం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
*లక్షదీపోత్సవం*
ఈ దీపోత్సవ కార్యక్రమంలో పుష్కరిణి ప్రాంగణమంతా కూడా దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు.
*పుష్కరిణి హారతి (దశవిధ హారతులు)*
అదేవిధంగా సాయంత్రం గం.6.30ల నుండి ముందుగా శ్రీస్వామిఅమ్మవార్లకు , పుష్కరిణికి దశవిధ హారతులు శాస్త్రోక్తంగా సమార్పిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి విశేషంగా పూజాదికాలు జరిపిస్తారని తెలిపారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను ఇస్తారని వివరించారు.
అనంతరం ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి,నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూర హారతి సమర్పణ వుంటుందన్నారు.
*దశహారతులు – దర్శనఫలం*
1. *ఓంకారహారతి :* పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం.
ఈ ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడతాయి. సకల శుభాలు కలుగుతాయి.
2. *నాగహారతి :* ఈ నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది.
3. *త్రిశూలహారతి :* ఈ త్రిశూలహారతిని దర్శించడం వలన అపమృత్యువు అంటే అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి.
4. *నందిహారతి :* ఈ నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండవు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి.
5. *సింహహారతి :* ఈ సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనో ధైర్యం కలుగుతుంది.
6. *సూర్య హారతి :* ఈ సూర్య హారతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది.
7. *చంద్రహారతి :* ఈ చంద్రహారతి దర్శించడం వలన మనశ్శుద్ధి కలిగి, ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
8. *కుంభహారతి :* ఈ కుంభహారతిని దర్శించడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి.
9. *నక్షత్రహారతి :* ఈ నక్షత్రహారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది.
10. *కర్పూరహారతి :* ఈ కర్పూరహారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
*కార్తీక మాసోత్సవాలు*
కార్తీకమాసం ఆదివారం సందర్భంగా ఈ రోజు భక్తులు వేకువజాము నుండే ఆలయాన్ని సందర్శించారని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
దర్శనం ఏర్పాట్లు :
కార్తీకమాసంలో ప్రభుత్వసెలవుదినాలు, కార్తీక సోమవారాలు, కార్తీకపౌర్ణమి రోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకోవడం జరుగుతోంది. భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
ఈ రోజు ఉదయం వేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంత్రం గం. 4.00ల వరకు దర్శనాలను ఏర్పాటు చేశామన్నారు.
అదేవిధంగా ఆలయశుద్ధి, ప్రదోషకాలం అనంతరం సాయంకాలం మహామంగళహారతి సమయంలో కూడా అనగా సాయంత్రం గం. 5.30ల నుంచి దర్శనాలు ప్రారంభించామన్నారు.
స్వామివార్ల అలంకార దర్శనం:
భక్తులరద్దీకారణంగా శని,ఆది,సోమవారాలలో , పౌర్ణమి మొదలైన రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేశామన్నారు. భక్తులందరికీ శ్రీస్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు:
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు రద్దీరోజులలో దేవస్థానం శాఖాధిపతులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించామన్నారు.
దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
క్యూలైన్లలో అల్పాహారం
కార్తీకమాసమంతా క్యూకాంప్లెక్స్ లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారంగా కట్టుపొంగలి, పులిహోర, పెరగన్నం, బిస్కెట్లు మరియు మంచినీరు అందజేయడం జరుగుతోందన్నారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం వేళలలో వేడిపాలు కూడా అందించబడ్డాయని అన్నారు.
కార్తీకదీపోత్సవం
భక్తులు కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధి మరియు గంగాధరమండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయన్నారు. అదేవిధంగా గంగాధర మండపం వద్ద పలువురు భక్తులు దీపారాధన చేసుకోవడం జరిగిందన్నారు.
అన్నప్రసాద వితరణ
భక్తులకు అన్నప్రసాదవితరణ భవనంలో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ చేయబడుతున్నాయని తెలిపారు. . అలాగే సాయంత్రం గం. 7.00 నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయబడుతుందన్నారు.
లడ్డు ప్రసాదాలు
కార్తీకమాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 12 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలు అందజేయబడుతున్నాయని అన్నారు. ఇందులో ప్రత్యేకంగా మహిళలకు ఒక కౌంటరు మరియు వృద్ధులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)
శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ
