శ్రీశైల దేవస్థానం:దేవస్థానం కల్యాణకట్టను ఈ రోజు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్యాణకట్టలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. కల్యాణకట్టలో నిరంతరం శుచీశుభ్రతలను పాటిస్తుండడంతో పాటు కల్యాణకట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
అదేవిధంగా కేశఖండానికి వచ్చే భక్తులు అధిక సమయం వేచివుండకుండా తగు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కల్యాణకట్టలో విద్యుద్దీపాలు, ఫ్యాన్లు సజావుగా పనిచేసే విధంగా సంబంధిత సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది ఏకరూప దుస్తులను ధరించడంతో పాటు అందరు కూడా సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు.
ముఖ్యంగా భక్తులతో మర్యాదగా మెలగాలని క్షురకులకు , కౌంటరు సిబ్బందికి సూచించారు.
అనంతరం కల్యాణకట్టలో వినియోగార్థం దేవస్థానం కొనుగోలు చేసిన బ్లేడ్ సేవ్ క్లిప్పులు, బ్లేడు కత్తి, హెయిర్ రిమూవర్ స్పాంజ్, వైపర్స్ మొదలైన వాటిని కల్యాణకట్ట సిబ్బందికి అందించారు.సంబంధిత గుమాస్తా శ్రీమతి పార్వతి, కల్యాణకట్ట సిబ్బంది పాల్గొన్నారు
