శ్రీశైల దేవస్థానం:కార్తీకమాసంలో శలవు దినమైన ఆదివారం భక్తులు వేకువజాము నుండే ఆలయాన్ని సందర్శించినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
దర్శనం ఏర్పాట్లు:
కార్తీకమాసంలో ప్రభుత్వసెలవుదినాలు, కార్తీక సోమవారాలు , కార్తీకపౌర్ణమి రోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకోవడం జరుగుతోంది. భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
ఈ రోజు ఉదయం వేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంత్రం గం. 4.00ల వరకు దర్శనాలను ఏర్పాటు చేశామన్నారు.
అదేవిధంగా ఆలయశుద్ధి, ప్రదోషకాలం అనంతరం సాయంకాలం మహామంగళహారతి సమయంలో కూడా అనగా సాయంత్రం గం. 5.30ల నుంచి దర్శనాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు.
స్వామివార్ల అలంకార దర్శనం:
భక్తులరద్దీకారణంగా శని,ఆది,సోమవారాలలో , పౌర్ణమి మొదలైన రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు. భక్తులందరికీ శ్రీస్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు:
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు రద్దీరోజులలో దేవస్థానం శాఖాధిపతులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించామన్నారు.
దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
క్యూలైన్లలో అల్పాహారం:
కార్తీకమాసమంతా క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారంగా కట్టుపొంగలి, పులిహోర, బిస్కెట్లు , మంచినీరు అందజేయడం జరుగుతోందన్నారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం వేళలలో వేడిపాలు కూడా అందించామన్నారు.
కార్తీకదీపోత్సవం:
భక్తులు కార్తికదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధి , గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు. అదేవిధంగా గంగాధర మండపం వద్ద పలువురు భక్తులు దీపారాధన చేసుకోవడం జరిగిందన్నారు.
అన్నప్రసాద వితరణ:
భక్తులకు అన్నప్రసాదవితరణ భవనంలో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ చేస్తున్నామన్నారు. సాయంత్రం గం. 7.00 నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు ఉందన్నారు.
లడ్డు ప్రసాదాలు:
కార్తీకమాసంలో భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని 12 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలు అందస్తున్నామన్నారు. ఇందులో ప్రత్యేకంగా మహిళలకు ఒక కౌంటరు , వృద్ధులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు.
16న లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి:
కార్తిక మొదటి సోమవారం సందర్భంగా 16న పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సం , పుష్కరిణిహారతిని వుంటాయని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
లక్షదీపోత్సవం:
ఈ దీపోత్సవ కార్యక్రమంలో పుష్కరిణి ప్రాంగణమంతా కూడా దీపాలను ఏర్పాటు వుందని తెలిపారు..
పుష్కరిణి హారతి (దశవిధ హారతులు)
సాయంత్రం గం. 6.30ల నుండి ముందుగా శ్రీస్వామిఅమ్మవార్లకు , పుష్కరిణికి దశవిధ హారతులు శాస్త్రోక్తంగా ఇవ్వబడుతాయన్నారు.
కాగా ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి విశేషంగా పూజాదికాలు జరిపించబడుతాయని తెలిపారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను ఇవ్వడం జరుగుతుందన్నారు.
అనంతరం ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి,నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి సమర్పణ వుంటుందని చెప్పారు.
