శ్రీశైల దేవస్థానం:ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు శనివారం సాయంత్రం పలు ప్రదేశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు అధికారులతో కలిసి చేసిన ఈ తనిఖీలలో భక్తుల సౌకర్యాలకు సంబంధించి పలు ఆదేశాలు జారీ చేశారు.
దేవస్థానం కల్యాణకట్ట ప్రాంగణ పరిసరాలు, శివసేవకుల డార్మెటరీలు, శివదీక్షా శిబిరాలు, సిద్ధిరామప్పవాణజ్య సముదాయ పరిసరాలు, మల్లికార్జునసదన్, గణేశ్ ఫుడ్ కోర్ట్, గణేశ సదనం, నక్షత్రవనం తదితర వాటిని పరిశీలించారు.
ధర్మకర్తల మండలి అధ్యక్షుల మాట్లాడుతూ దేవస్థానం పరిధిలో అన్ని ప్రదేశాలలో కూడా శుచీశుభ్రతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని వసతి సముదాయలలో, భవనాలలో, ఆరుబయలు ప్రదేశాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సిబ్బంది అందరు భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. అదేవిధంగా డార్మెటరీలలో శివసేవకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. మల్లికార్జునసదన్, గణేశ్ సదన్ తదితర భవనాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఆయా భవన సముదాయాలలో ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేస్తుండాలన్నారు. వసతిగదులలో ఏసి, ఫ్యాన్లు, గీజర్లన్నీ సజావుగా పనిచేసే విధంగా రోజువారి పర్యవేక్షణను చేస్తుండాలని వసతివిభాగ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే ఎటువంటి ఆలస్యం లేకుండా ఆయా గదులలో మరమ్మతులు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గదులు, కాటేజీలు ఖాళీ అయిన వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా వాటిని శుభ్రపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
తనిఖీల సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సిబ్బంది అందరు కూడా సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు. కేశఖండానికి వచ్చే భక్తులు అధిక సమయం వేచివుండకుండా తగు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కల్యాణకట్టతో పాటు అన్ని భవనాలలో విద్యుద్దీపాలు, ఫ్యాన్లు సజావుగా పనిచేసే విధంగా సంబంధిత సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వీటిని పరిశీలిస్తుండాలన్నారు. సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించాలని అన్నారు. అదేవిధంగా సిబ్బంది అందరు కూడా గుర్తింపుకార్డులను ధరించాలన్నారు. ఏ ఒక్క భక్తుడి నుంచి కూడా ఫిర్యాదు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తుండాలని అక్కడి సిబ్బంది సూచించారు. భవన ప్రాంగణాలలో ఫ్లోరింగ్ మొదలైన చోట్ల ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తుండాలన్నారు. క్షేత్రపరిధిలోని శౌచాలయాల నిర్వహణ పట్ల అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. శౌచాలయాల శుభ్రత నిరంతరం జరుగుతుందలన్నారు. భవన సముదాయలలో, ఆరుబయలు ప్రదేశాలలో మరిన్ని మొక్కలు నాటాలని ఆదేశించారు.
ఈ తనిఖీలలో సహాయ కార్యనిర్వహణాధికారులు యం. ఫణిధర ప్రసాద్, కె. వెంకటేశ్వరరావు, సి.హెచ్. శ్రీనివాసరెడ్డి, ఇంఛార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు చంద్రశేఖరశాస్త్రి, పి.వి. సుబ్బారెడ్డి, పర్యవేక్షకులు బి. శ్రీనివాసులు, పి. రాజశేఖర్, సంబంధిత సహాయక ఇంజనీర్లు, ఉద్యానవన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
