శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా రేపు 20న దేవస్థానం కోటిదీపోత్సవ కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
వారు మాట్లాడుతూ ఆగమ పాఠశాల ఎదురుగా మైదానంలో సాయంత్రం గం. 6.00ల నుంచి ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక వేదిక కూడా సిద్ధం అవుతోందని వివరించారు.
కాగా ఈ కోటి దీపోత్సవానికి కావలసిన పూజాద్రవ్యాలనన్నింటినీ దేవస్థానమే సమకూరుస్తుందని తెలిపారు.
సాయంత్రం గం. 5.00ల నుంచి ఆధ్యాత్మిక ప్రవచనం, సంప్రదాయ నృత్య ప్రదర్శన మొదలైన ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రముఖ సినీ నేపథ్యగాయకులు నాగూరుబాబు ( మనో ) , వారి బృందంచే భక్తి సంగీత స్వరార్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. పలువురు ప్రఖ్యాత గాయనీ గాయకులచేత ఈ స్వరార్చన జరుగుతుందన్నారు.
కార్యక్రమములో కోటిదీపోత్సవ ప్రత్యేక వేదికపై శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజాదికాలు నిర్వహిస్తామన్నారు.
అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు దశహారతులుగా ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి సమర్పించబడుతాయన్నారు.
చివరగా మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనంతో కోటిదీపోత్సవ కార్యక్రమం ముగుస్తుందన్నారు.
ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ వైదిక సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. దీపజ్యోతిని యజ్ఞాగ్నికి సంకేతంగా చెప్పడం మన సంప్రదాయమన్నారు. అందుకే సంప్రదాయబద్దంగా ఈ కోటిదీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ జ్ఞానం, వెలుగు, ఉత్సాహం, ఆనందం, శాంతి మొదలైనవాటికి దీపాన్ని ప్రతీకగా భావిస్తారన్నారు. దీపారాధన వలన ఈ దివ్యగుణాలను పొందవచ్చునని పండితులు పేర్కొంటున్నారని అన్నారు. అదేవిధంగా శ్రీస్వామిఅమ్మవార్లకు దీపజ్యోతిని సమర్పించడం వలన సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతోందన్నారు.
భక్తులందరు ఈ కార్యక్రమానికి విచ్చేసి శ్రీస్వామిఅమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు , కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.
