శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా 20 న నిర్వహించిన కోటిదీపోత్సవ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఈ రోజు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు అభినందన సమావేశాన్ని నిర్వహించారు. సిబ్బంది అందరు కూడా బాధ్యతాయుతంగా , శ్రద్ధా భక్తులతో కార్యక్రమ నిర్వహణలో తమవంతు పాత్రపోషించారని చెబుతూ సిబ్బందిని అభినందించారు. అందరు కూడా అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు.
సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ సిబ్బంది అందరు కూడా ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించడం వల్ల ఈ కోటిదీపోత్సవ కార్యక్రమమంతా ఎంతో సజావుగా జరిగిందన్నారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల సిబ్బందికి పేరు పేరునా అభినందనలను తెలియజేస్తున్నానని అన్నారు. ఆగమ పాఠశాల ఎదురుగా మైదానాన్ని చదును చేయడం, బ్యారికేడింగ్ ఏర్పాట్లు, కైలాసం నమూనాలో వేదిక నిర్మాణం, లైటింగ్ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు, దీపోత్సవానికి క్రమపద్దతిలో ఒత్తులు , ప్రమిదల ఏర్పాట్లు, ధార్మిక సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ, కార్యక్రమం సమన్వయం మొదలైన ఏర్పాట్లన్నీ కూడా సిబ్బంది అందరూ ఎంతో సమర్థవంతంగా నిర్వహించారన్నారు. అదేవిధంగా అర్చకస్వాములు, వేదపండితులు ఎంతో సంప్రదాయబద్దంగా పూజాదికాలు, దశహారతులు, దీపారాధన కైంకర్యాలను నిర్వహించారన్నారు. ఇదే స్ఫూర్తితో సిబ్బంది అందరు ఇటువంటి మరిన్ని ధార్మిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇటువంటి కార్యక్రమాల వలన విస్తృతంగా ధర్మప్రచారం చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. దేవస్థానం నిర్వహించిన ఈ కోటిదీపోత్స కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రచారం లభించిందన్నారు.
అంతకుముందు కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ గత సంవత్సరం ఈ కోటిదీపోత్సవ కార్యకార్యక్రమాన్ని ప్రధానాలయానికి ఎదురుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఆగమ పాఠశాలకు ఎదురుగా విశాల ప్రాంగణంలో నిర్వహించడం వలన అధికసంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం కలిగిందన్నారు. సిబ్బంది అందరు కూడా పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించడం వలనే దీపోత్సవ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ముందస్తుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాలు కూడా క్రమపద్దతిలో దీపోత్సవ ఏర్పాట్లను చేశారన్నారు. ఈ కోటిదీపోత్సవంలో సిబ్బంది, స్థానికులే కాకుండా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
కార్యక్రమములో పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
