శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఈ రోజు దేవస్థానం కోటిదీపోత్సవ
కార్యక్రమాన్ని ఘనంగా సంప్రదాయబద్దంగా నిర్వహించిందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. ఆగమపాఠశాల ఎదురుగా మైదానంలో సాయంత్రం గం. 4.30ల నుంచి ఈ కోటిదీపోత్సవo మొదలయిందన్నారు. ఇందుకోసం కైలాస పర్వత నమూనాలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసామన్నారు.
కాగా ఈ కార్యక్రమములో ముందుగా కోటిదీపోత్సవ ప్రత్యేకతను, దీపారాధన విశేషాలను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డా. దీవి హయాగ్రీవాచార్యుల తెలిపారన్నారు.
అదేవిధంగా కోటిదీపోత్సవ ప్రత్యేక వేదికపై సాయంత్రం గం.7.00ల నుంచి శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజలు, కోటిదీపోత్సవం జరిగింది.
అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు దశవిధ హారతులుగా ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి సమర్పించారన్నారు.
కాగా కార్యక్రమాల అనంతరం నీరాజన మంత్ర పుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ జరిగింది.
ఘనంగా భక్తి సంగీత స్వరార్చన:
కోటిదీపోత్సవ కార్యక్రమములో భాగంగా ప్రఖ్యాత సినీ నేపథ్య గాయకులు మనో బృందం భక్తి సంగీత స్వరార్చన కార్యక్రమము ఘనంగా నిర్వహించింది.ఈ కార్యక్రమములో ముందుగా వాతాపి గణపతిం భజే అంటూ గణపతి స్తుతితో ఆరంభించి ఓంకార నాదాను, జయ జయ మహాదేవ నీల కంధర, మహాప్రాణ దీపం మొదలైన భక్తి గీతాలను, శివ సంబంధిత అష్టకాలను, స్తోత్రాలను ఆలపించారు.
ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, అర్చక స్వాములు, వేదపండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
