శ్రీశైల దేవస్థానం:
ఈ రోజు జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 4,47,85,335 /- లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. వివరాలు ఇవి.
ఈ హుండీల రాబడిని భక్తులు గత 31 రోజులలో ( 26.10.2026 నుండి 25.11.2026 వరకు) సమర్పించారు.
ఈ హుండీలో 85 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారం, 2 కేజీల 980 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా 722 – యుఎస్ఏ డాలర్లు, 270 – యు.ఏ.ఇ దిర్హమ్స్, 95 – ఆస్ట్రేలియా డాలర్లు , 30 – ఇంగ్లాండు పౌండ్స్, 25 – కెనడా డాలర్లు, 60 – యూరోస్, 62 – మలేషియా రింగిట్స్, 300 – సౌది అరేబియా రియాల్స్, 10 – న్యూజిలాండ్ డాలర్స్, 10 – సింగపూర్ డాలర్లు, 1 – కువైట్ దినార్, 2 – ఖత్తార్ రియాల్స్ మొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు.
ఈ హుండీల లెక్కింపును ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
అదేవిధంగా హుండీల లెక్కింపులో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఎస్. చంద్రశేఖర్, పలువిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
నవంబరు 27న స్వర్ణ రథోత్సవం:
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని నవంబరు 27న శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేశారు.
ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహిస్తారు.అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపిస్తారు.
ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు వుంటాయి.
అనంతరం ఉదయం గం.7.30లకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమై. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి గంగాధరమండపం వరకు రథోత్సవం వుంటుందని తెలిపారు.
సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో కోలాటం, తప్పెట చిందులు, మొదలైన కళారూపాల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.
భక్తులందరూ ఈ స్వర్ణ రథోత్సవంలో పాల్గొని శ్రీస్వామిఅమ్మవార్ల కృపాకటాక్షాలను పొందవలసినదిగా ధర్మకర్తలమండలి అధ్యక్షులు కార్యనిర్వహణాధికారి కోరారు.
