శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ రోజు కార్తీక వన భోజనాల కార్యక్రమం నిర్వహించినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
ఆలయ ఈశాన్య భాగంలోని రుద్రవనంలో (రుద్రాపార్కులో) ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
వనభోజన కార్యక్రమములో స్థానిక గౌరవ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులుపోతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ,పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీశైలదేవస్థానం విభాగాల అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
పలుస్థానిక ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.
కార్యక్రమములో ముందుగా సంప్రదాయాన్ని అనుసరించి రుద్ర వనములోని ఉసిరిచెట్టుకు సంప్రదాయబద్దంగా పూజాదికాలు జరిపారు .
ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ వైదిక సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా , ఆలయ సంప్రదాయాలపై అందరికి అవగాహన కల్పించాలనే భావనతో ఈ వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసామన్నారు
సంప్రదాయబద్దంగా వన భోజనాలు చేయడం వలన విశేష ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయన్నారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీశైలమహాక్షేత్రంలో వనభోజనాలు ఆచరించడం వల్ల మరింత ఫలితం లభిస్తుందన్నారు.
శ్రీశైలాన్ని క్షేత్రంగానే కాకుండా గొప్పతీర్థంగా కూడా మన పురాణాలు పేర్కొన్నాయన్నారు. ఈ క్షేత్రం ఎన్నో తీర్థాలకు నిలయమన్నారు. శ్రీశైల మహాక్షేత్రానికి అనాది క్షేత్రం అనే ప్రసిద్ధి ఉందన్నారు. యుగయుగాలుగా ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. భూ మండలానికి నాభిస్థానంగా ఈ క్షేత్రం పేర్కొనబడిందని, అందుకే మనం ఆచరించే వైదిక కార్యక్రమాలు, పూజాదికార్యక్రమాలలో చెప్పే సంకల్పంలో మన ఉనికిని శ్రీశైలక్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని చెప్పడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా కార్తీకమాసం – వసభోజనాల విశిష్టత అనే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ నోరి నారాయణమూర్తి, తెనాలి ప్రవచనం చెప్పారు. అనంతరం లిక్షితాశ్రీ నృత్యకళాశాల, నందికొట్కూరు వారి సంప్రదాయ నృత్య ప్రదర్శన జరిగింది.
