శ్రీశైల దేవస్థానం:
• డిసెంబరు నెలకు సంబంధించి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు , ఆర్జితసేవా టికెట్ల విడుదల
• రాష్ట్ర ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ ద్వారా టికెట్లు పొందే అవకాశం
• ఏ.పి.టి.ఎస్ వారి వెబ్సైట్ www.tms.ap.gov.in ద్వారా కూడా టికెట్లు పొందే సదుపాయం.
• టికెట్ల లభ్యతను బట్టి ఒక గంట ముందువరకు కూడా ఆర్జితసేవా టికెట్లు పొందే ఏర్పాటు
డిసెంబరు మాసానికి సంబంధించి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్రదర్శనం , ఆర్జితసేవాటికెట్లను ఈ రోజు 25 న విడుదల చేసామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
భక్తులు సులభంగా ఆయా టికెట్లు పొందేందుకు వీలుగా 80శాతం టికెట్లను రాష్ట్ర ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించిందని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 ద్వారా ఈ టికెట్లను పొందవచ్చునని అన్నారు.
మిగిలిన 20శాతం టికెట్లను ఏ.పి.టి.ఎస్ వారి వెబ్సైట్ www.tms.ap.gov.in ద్వారా పొందవచ్చునని అన్నారు.
శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను మనమిత్ర వాట్సాప్ లేదా ఆన్లైన్ ద్వారా పొందవలసివుంటుందని తెలిపారు.
అదేవిధంగా శ్రీస్వామివారి ఆర్జిత గర్భాలయఅభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం,మహామృత్యుంజయ హోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలైన ఆయా 14 రకాల ఆర్జితసేవలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా వీటి ద్వారా పొందవచ్చునని తెలిపారు.
ఆయా సేవాటికెట్లు పొందినవారు విధిగా మనమిత్ర లేదా ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్ కాపీని ( హార్డుకాపీ) , ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీని తప్పని సరిగా తీసుకురావలసివుంటుంది. ఆయా సేవాటికెట్లను స్కానింగ్ జరిపి సంబంధిత టికెట్లను ఒరిజినల్ ఆధార్ గుర్తింపు కార్డుతో సరిచూసిన తదుపరే భక్తులను ఆయా ఆర్జిత సేవలకు అనుమతించడం జరుగుతుందన్నారు.
భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పలుచోట్ల మనమిత్ర వాట్సాప్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక యథావిధిగా ప్రతీరోజు ఉదయం గం.4.30లనుంచి సర్వదర్శనం (ఉచిత దర్శనం) ఉంటుందన్నారు.
కాగా కార్తిక మాసం కారణంగా డిసెంబరు 9వ తేదీ వరకు శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకం ( రూ. 5000/-లు) సామూహిక అభిషేకాలు ( రూ. 1500/-), ఉదయాస్తమానసేవ, ప్రాత:కాలసేవ, ప్రదోషకాలసేవలు పూర్తిగా నిలుపుదల చేయడమైనదన్నారు. ఆర్జిత హోమాలు, కల్యాణోత్సవం మొదలైనవి యథావిధిగా జరుగుతాయన్నారు.
అదేవిధంగా కార్తికమాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 5,6,7 తేదీలలో స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు. కార్తికమాస రద్దీరోజులలో అమ్మవారి అంతరాలయంలో జరిగే రూ.1000/-ల కుంకుమార్చనను అమ్మవారి ఆశీర్వచనమండపంలో చేసుకునే వీలు కల్పించబడిందన్నారు.
డిసెంబరు 20వ తేదీన ముక్కొటి ఏకాదశి రోజున ఉదయం వేళలో మొదటి స్పర్శదర్శనం స్లాటును నిలుపుదల చేశామన్నారు
