శ్రీశైల దేవస్థానం:
దేవస్థానం ప్రతీ నెలలో చివరి బుధవారం రోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించినందున ఇందులో భాగంగా ఈ రోజు 420 మంది చెంచు గిరిజన భక్తులకు శ్రీస్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం , అమ్మవారి దర్శనం కల్పించారు.
స్థానిక చెంచుగూడెములతో పాటు పలు చెంచు గూడెముల చెంచు గిరిజనులు స్పర్శదర్శనాన్ని చేసుకున్నారు.
దర్శనానంతరం చెంచు గిరిజన భక్తులందరికీ దేవస్థాన అన్నపూర్ణా ప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేసారు.
కాగా ఈ రోజు ఉదయం చెంచుగిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. వారికి ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, సంబంధిత అధికారులు ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ తాము పదవీబాధ్యతలను స్వీకరించిన వెంటనే స్థానిక మేకలబండ చెంచుగూడెములను సందర్శించానన్నారు. ఆ సందర్భంలో చెంచు భక్తులు తమకు స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించవలసినదిగా కోరడం జరిగిందన్నారు. తదనుగుణంగా గత సంవత్సరం చెంచుభక్తులకు నెలలో ఒకరోజున ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించాలని ధర్మకర్తల మండలి సమావేశములో తీర్మానించడం జరిగిందన్నారు
గత డిసెంబరు 30వ తేదీ నుంచి ఈ ఉచిత స్పర్శదర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.
శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచుగిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకున్నామని చెప్పారు.
.
.
