శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం
తేది: 03.11.2026
కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక గ్రంథం ‘శివ: అనాదిహై అనంత్హై’లో శ్రీశైల మహాక్షేత్ర విశేషాలు
శ్రీశైలం:
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖలోని భాషా విభాగం ప్రచురించిన ప్రత్యేక గ్రంథం “శివ: అనాదిహై అనంత్హై” లో శ్రీశైల మహాక్షేత్రానికి సంబంధించిన విశేషాలు విశేష ప్రచారం పొంది ప్రచురితమయ్యాయి. ఈ విషయమై శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు ప్రకటన విడుదల చేశారు.
ఈ గ్రంథంలో శివతత్త్వంపై వివిధ కోణాల్లో పలు శ్రేష్ఠమైన రచనలు చోటుచేసుకోగా, రమేష్‌నాయుడు స్వయంగా రచించిన శ్రీశైల క్షేత్ర మహత్యానికి సంబంధించిన ప్రత్యేక వ్యాసం కూడా ప్రచురితమైంది. ఈ విశిష్ట గ్రంథాన్ని గత సెప్టెంబరు 14న నవీ ముంబైలో నిర్వహించిన 6వ అఖిల భారత అధికార భాషా సదస్సు (6th All India Official Language Conference)లో గౌరవనీయ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు.
వ్యాసంలోని ముఖ్యాంశాలు:
జ్యోతిర్లింగ-శక్తిపీఠాల సమాహారం: మరెక్కడా లేని విధంగా ఒకే ఆలయ ప్రాంగణంలో జ్యోతిర్లింగం (మల్లికార్జున స్వామి), మహా शक्तिపీఠం (భ్రమరాంబ దేవి) కొలువై ఉన్న విశిష్టత.
ప్రాచీనత & వైదిక ప్రాముఖ్యత: ‘ఇలకైలాసం’గా, అనాది క్షేత్రంగా ప్రసిద్ధి చెందడం మరియు వైదిక క్రతువుల్లో శ్రీశైలాన్ని కేంద్రంగా చేసుకొని సంకల్పాలు చెప్పుకునే సాంప్రదాయం.
చరిత్ర & సంస్కృతి: శ్రీస్వామి-అమ్మవార్ల ఆవిర్భావం, క్షేత్ర చరిత్ర, సంస్కృతి-సంప్రదాయాలు మరియు దర్శనీయ స్థలాలు.
భౌగోళికం & నల్లమల అడవులు: శ్రీశైల భౌగోళిక స్వరూపం మరియు శ్రీశైల అటవీ ప్రాంతంలో లభించే అరుదైన వృక్ష సంపద.
హిందీ భాషలో ప్రచురితమైన ఈ గ్రంథం ద్వారా శ్రీశైల క్షేత్ర మహత్యం ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరింత ప్రచారం పొందుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఆశాభావం వ్యక్తం చేశారు.
