శ్రీశైల దేవస్థానం:
కాకినాడ జిల్లా, పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా ఎంటర్ ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్, మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు శ్రీ స్వామిఅమ్మవార్లకు ఈ రోజు పలు వెండి వస్తువులను, బంగారు అభరణాలను సమర్పించారు. బంగారు నామాలు , చంద్రవంక కలిగిన వెండి జటాజూటం, పలు వెండి పూజా వస్తువులు , బంగారు రుద్రాక్షమాల, మంగళసూత్రాలను వీరు సమర్పించారు.
సమర్పించిన మొత్తం వెండి వస్తువుల బరువు 42 కేజీల 516 గ్రాములు కాగా, బంగారు అభరణాల బరువు 73 గ్రాముల 500 మిల్లీ గ్రాములు. వీటి విలువ సుమారు కోటి రూపాయల దాకా ఉంటుందని దాతలు తెలియజేశారు.
ఈ బంగారు అభరణాలు , వెండి వస్తువులను దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ఆలా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మట్టే శ్రీనివాస్ కుటుంబసభ్యులైన రోహన్, రాకేష్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ డైరెక్టర్ ఆదిత్యకృష్ణ తదితరులు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుగారికి అందించారు.
కార్యక్రమములో స్వామివార్ల ప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయకుమార్ స్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజిరవి, ధర్మప్రచార పర్యవేక్షకులు నాగేశ్వరరావు, అమ్మవారి ఆలయ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, ముఖ్య భద్రతా అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అనంతరం దాతలకు తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందించారు.
