శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయిదవ రోజు గురువారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు. యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు.
అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు.
ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.
రావణ వాహనసేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు రావణ వాహనసేవ జరిపారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరిగింది.
గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేశారు.
