శ్రీశైల దేవస్థానం;
• మూడవ రోజు వరుణ యాగసహిత సహస్ర ఘటాభిషేక విశేషపూజలు
• విశేషపూజలలో భాగంగా యాగశాల ప్రవేశం
• రుద్ర,చండీ కలశస్థాపనలు, రుద్రపారాయణలు
• సాయంకాలం అంకురార్పణ
• విశేషపూజలలో పాల్గొన్న ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి ధర్మకర్తల మండలి సభ్యులు
• 10న నదీపూజ, ప్రధాన ఘటములతో ఆలయ ప్రదక్షిణ,
• శ్రీ మల్లికార్జునస్వామివారికి పంచామృతాభిషేకం, ప్రధాన ఘటాభిషేకం, సహస్రఘటాభిషేకం
సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో తేది07.08.2026 నుండి 11.08.2026 వరకు 5 రోజులపాటు వరుణ యాగసహిత సహస్ర ఘటాభిషేక విశేషపూజలు నేపధ్యంలో మూడవరోజు అయిన ఈ రోజు కొనసాగాయి.
యాగశాల ప్రవేశం :
సహస్రఘటాభిషేకవిశేషపూజలలో భాగంగా ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి, యం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, శ్రీమతి జి. లక్ష్మేశ్వరి, శ్రీ దేవకీ వెంకటేశ్వర్లు, శ్రీమతి యు. సుబ్బలక్ష్మీ, శ్రీమతి జి. జిల్లెల శ్రీదేవి, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు (అధ్యాపక), అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా యాగశాల ప్రవేశం చేశారు.
శివసంకల్పం :
తరువాత దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురువాలని, దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాలమరణాలు జరగకుండా ఉండాలనీ, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోక కల్యాణ సంకల్పాన్ని చెప్పారు.
గణపతిపూజ :
సంకల్పపఠనం తరువాత సహస్రఘటాభిషేక విశేషపూజలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను చేసారు.
చండీశ్వరపూజ :
గణపతిపూజ తరువాత శివ సంచార దేవతలలో ఒకరైన చండీశ్వరునికి విశేషపూజ జరిపించారు. ఈ చండీశ్వరుడు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం విశేషపూజలను నిర్వహిస్తారని చెప్పబడుతోంది.
కంకణపూజ – కంకణ ధారణ :
చండీశ్వర అర్చన తరువాత కంకణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. అనంతరం అధికారులు, అర్చకస్వాములు, స్థానాచార్యులు కంకణాలను ధరించారు.
ఋత్విగ్వరణం :
కంకణధారణ తరువాత ఋత్విగ్వరణం నిర్వహించారు. సహస్రఘటాభిషేక విశేష పూజలలో ఆయా వైదిక కార్యాలను నిర్వహించాలని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
అఖండదీప స్థాపన :
తరువాత అఖండ దీపస్థాపన, జరిపించారు.
రుద్ర,చండీకలశస్థాపనలు, మండపారాధనలు, విశేషార్చనలు, ఘటశుద్ధి, ఘటాలంకారములు, రుద్రపారాయణలు నిర్వహించారు.
సాయంకాలం కార్యక్రమాలు
అంకురార్పణ :
ఈ రోజు సాయంకాలం అంకురార్పణ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత ప్రదేశంలోని మట్టిని సేకరించి సంప్రదాయబద్దంగా యాగశాలకు తీసుకువచ్చారు . తరువాత ఈ మట్టిని 9 పాలికలలో ( మూకుళ్లలో) నింపి దాంట్లో నవధ్యానాలు పోసి ఆ మట్టిని మొలకెత్తించే పనిని తీసుకున్నారు . ఈ పాలికలలో రోజు నీరు పోసి నవధ్యానాలు పచ్చగా మొలకెత్తేలా చేస్తున్నారు. ఈ విధంగా అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు.
అనంతరం ఏకాదశ రుద్ర ఋష్యశృంగ సహిత సహస్ర ఘటస్థాపన, కలశార్చనలు, రుద్రపారాయణలు జరిపించారు
10 న కార్యక్రమాలు :
ఉదయం గం. 5.00ల నుండి ఏకాదశ రుద్ర ఋష్యశృంగ సహిత సహస్ర ఘటార్చన, మహాన్యాస పారాయణ, రుద్రపారాయణ, కాఠక శతానువాక పారాయణ, వేదపారాయణలు, వారుణానువాక సహిత ఋష్యశృంగ పారాయణ, రుద్రహోమం, చండీపారాయణ, శ్రీ చక్రార్చాన నవావరుణార్చన విశేష కుంకుమార్చనలు .
అనంతరం ఉదయం గం. 7.00లకు నదీపూజ, పుణ్యనదీజలాలతో పాతాళేశ్వరస్వామివారికి అభిషేకం, నందీశ్వరస్వామివారికి అభిషేకం, గ్రామ దేవత అంకాళమ్మ వారికి అభిషేకం , క్షేత్రపాలకుడు బయలువీరభద్రస్వామివారికి అభిషేకం.
ఆ తరువాత ప్రధాన ఘటములతో ఆలయ ప్రదక్షిణ అనంతరం శ్రీ మల్లికార్జునస్వామివారికి పంచామృత అభిషేకం, ప్రధాన ఘటాభిషేకం, సహస్ర ఘటాభిషేక కార్యక్రమాలు వుంటాయి.
