శ్రీశైల దేవస్థానం:
ధర్మకర్తల మండలి సమావేశం:
• 10వ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు నిర్ణయాలు*
• క్యూకాంప్లెక్సు నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించేందుకు చర్యలు
• ఏప్రియల్ మాసం నుంచి జూలై మాసం వరకు జమాఖర్చుల పరిశీలన
దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం 25 న అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు అధ్యక్షతన జరిగింది.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈనాటి సమావేశంలో మొత్తం 18 అంశాలు చర్చించారు. వీటిలో 15 అంశాలు ఆమోదించారు. మిగతా 3 అంశాలను వాయిదా వేశారు.
పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ క్షేత్రపరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించడం జరుగుతోందన్నారు.క్షేత్రాన్ని దర్శించే సామాన్య భక్తుల సౌకర్యాల కల్పనకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా క్షేత్రాన్ని దర్శించే ప్రతీ భక్తుడిని ఒక అతిథిగా భావిస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగా ఆయా సౌకర్యాల కల్పనను చేపట్టడం జరుగుతుందన్నారు.
సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తుల సౌకర్యార్థం ప్రతీ శని,ఆది,సోమవారాలలో ఉదయం , మధ్యాహ్నవేళలో శ్రీస్వామివారి స్పర్శదర్శనాన్ని పూర్తిగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా కేవలం రాత్రి వేళలో మాత్రమే శ్రీస్వామివారి స్పర్శదర్శనం కల్పిస్తున్నామన్నారు.
భక్తుల సౌకర్యార్థం నిర్మించతలపెట్టిన క్యూకాంప్లెక్సు నిర్మాణ పనులను వీలైనంత త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే ఈ నిర్మాణానికి సంబంధించిన డి.పి.ఆర్ దాదాపుగా పూర్తి కావచ్చిందన్నారు. మొత్తం ఒకేసారి 12వేల మంది భక్తులు వేచివుండేవిధంగా 3 అంతస్తులుగా ఈ క్యూకాంప్లెక్సును నిర్మించాలని భావిస్తున్నామన్నారు.
శ్రీశైల దక్షిణద్వారమైన జ్యోతిస్సిద్ధవట ఆలయాలను దశలవారిగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 29 నుంచి 31 వరకు సిద్ధవట ఆలయంలో నూతన ధ్వజప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
• సెప్టెంబరు 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న గణపతి నవరాత్రోత్సవాలలో సాక్షిగణపతి ఆలయం వద్ద తగు విద్ద్యుదీపాలంకరణ చేయాలని నిర్ణయించడం జరిగింది.
• 2026 -27 సంవత్సరానికి సంబంధించి ఏప్రియల్ మాసం నుంచి జూలై మాసం వరకు గల దేవస్థాన జమాఖర్చులు పరిశీలించారు.
• దేవస్థానంలో స్వచ్ఛందసేవను నిర్వహిస్తున్న శివసేవకుల వసతి కోసం వినియోగిస్తున్న నందికేశ సదనం లో మరిన్ని పరుపులు, దిండ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. వీటి అంచనా వ్యయం సుమారు రూ.19 లక్షలు.
• గణేశసదనం మరియు ఔటర్‌రింగ్‌రోడ్డు సెంట్రల్ పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేయబడిన టాయిలెట్స్ బ్లాక్ ముందు మరియు సమీప ఖాళీస్థలంలో సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగు వేయాలని నిర్ణయించడం జరిగింది. దీని అంచనా వ్యయం రూ. 9.20 లక్షలు
• పాతాళగంగమార్గంలోని పబ్లిక్ టాయిలెట్స్ కు పూర్తిస్థాయి మరమ్మతులు, డ్రైనేజీ మరమ్మతులు మరియు ఫ్లోరింగ్ పనులు చేయాలని తీర్మానించడం జరిగింది. దీని అంచనా వ్యయం రూ. 32 లక్షలు
• భక్తులు శ్రీస్వామిఅమ్మవార్లకు సమర్పించే వస్త్రాలను స్వీకరించే వీలుగా అమ్మవారి ఆలయంలోని అనువైన ప్రదేశంలో శాశ్వత ప్రాతిపదికన వస్త్రముల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
