శ్రీశైల దేవస్థానం:
• సెప్టెంబరు నెలకు సంబంధించి శ్రీస్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు , ఆర్జితసేవా టికెట్లు ఈ నెల 25న విడుదల
• రాష్ట్ర ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ ద్వారా టికెట్లు పొందే అవకాశం
• ఏ.పి.టి.ఎస్ వారి వెబ్సైట్ www.tms.ap.gov.in ద్వారా కూడా టికెట్లు పొందే సదుపాయం.
• టికెట్ల లభ్యతను బట్టి ఒక గంట ముందు వరకు కూడా ఆర్జితసేవా టికెట్లు పొందే ఏర్పాటు
– కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు
సెప్టెంబరు మాసానికి సంబంధించి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్రదర్శనం , ఆర్జితసేవాటికెట్లను రేపు (25.08.2026) విడుదల చేయనున్నట్లు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
భక్తులు సులభంగా ఆయా టికెట్లు పొందేందుకు వీలుగా 90శాతం టికెట్లను రాష్ట్ర ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించడం జరుగుతోందన్నారు.
మిగిలిన 10 శాతం టికెట్లను ఏ.పి.టి.ఎస్ వారి వెబ్సైట్ www.tms.ap.gov.in ద్వారా పొందవచ్చునని అన్నారు.
అలాగే పరోక్షసేవాటికెట్లను కూడా మనమిత్ర వాట్సప్ మరియు ఆన్లైన్ ద్వారా పొందవచ్చునన్నారు. శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా సేవలను పరోక్షంగా జరిపించుకునే వీలుగా దేవస్థానం ఈ పరోక్షసేవలను నిర్వహించడం జరుగుతోందన్నారు.
ఆయా పౌరసేవలను సమర్థవంతంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు వీలుగా వచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో పౌరులు పలు శాఖలకు సంబంధించిన ఆయా సేవలను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.
ఆయా సేవలను సులభతరంగా అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ నెంబరును 9552300009 అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్గా ఈ వాట్సాప్ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందన్నారు.
కాగా ఈ మనమిత్ర వాట్సాప్ ద్వారా దేవదాయశాఖ పరిధిలోని పలు ఆలయాల దర్శనం టికెట్లు, ఆర్జితసేవాటికెట్లు, ప్రసాదాల టికెట్లు మరియు విరాళాలను చెల్లించే విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.
ఈ క్రమములో వాట్సాప్ ద్వారా శ్రీశైలదేవస్థానం నందలి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా శ్రీస్వామివారి ఆర్జిత గర్భాలయఅభిషేకం, ఆర్జితసామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలైన ఆయా 14 రకాల ఆర్జితసేవలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా పొందవచ్చునని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా దర్శనం మరియు ఆర్జితసేవాటికెట్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
తదుపరి వారాంతపు రోజులు, సెలవురోజులు మరియు సోమవారం, ఇతర పర్వదినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ రోజులలో ముందస్తు టికెట్లు దొరకని భక్తులు టికెట్ అందుబాటులో ఉండే మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో ఆయా టికెట్లను పొందవచ్చు.
ఆయా సేవాటికెట్లు పొందినవారు విధిగా మనమిత్ర లేదా ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్ కాపీని ( హార్డుకాపీ) మరియు ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీని తప్పని సరిగా తెచ్చుకోవలసివుంటుందన్నారు.
ఆయా సేవాటికెట్లను స్కానింగ్ జరిపి సంబంధిత టికెట్లను ఒరిజినల్ ఆధార్ గుర్తింపు కార్డుతో సరిచూసిన తదుపరే భక్తులను ఆయా ఆర్జిత సేవలకు అనుమతించడం జరుగుతుందన్నారు.
భక్తుల కోరిక మేరకు మరియు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆర్జితసేవల ప్రారంభ సమయానికంటే ఒక గంట ముందు వరకు కూడా అందుబాటును బట్టి భక్తులు మనమిత్ర, ఆన్లైన్లో టికెట్లను పొందే అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పలుచోట్ల మనమిత్ర వాట్సాప్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
ఇక యథావిధిగా ప్రతీరోజు ఉదయం గం.4.30లనుంచి సర్వదర్శనం (ఉచిత దర్శనం)ఉంటుందన్నారు.
