శ్రీశైల దేవస్థానం:
• ధర్మప్రచారంలో భాగంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
• సామూహిక వరలక్ష్మీవ్రతంలో పాల్గొన 1800 మంది పైగా భక్తులు
• వ్రతములో పాల్గొనవారందరికీ చీర, రవికవస్త్రం, వృక్ష ప్రసాదం అందజేత
• వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనం , అన్న ప్రసాదాల ఏర్పాట్లు
వరలక్ష్మీవ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు 21న దేవస్థానం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది.
ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణ మండపంలో ఈ ఉచిత సామూహికవ్రతాలు నిర్వహించారు.
1800 మందికి పైగా భక్తులు ఈ వ్రతాన్ని జరిపించుకున్నారు.
కాగా ఈ వ్రతాలకు కావలసిన పూజాద్రవ్యాలన్నింటినీ దేవస్థానమే సమకూర్చింది. వ్రత కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికోసం వేరువేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా ఈ వ్రతం జరిపించారు.
సంప్రదాయబద్దంగా జరిగిన ఈ వ్రతంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ నిర్వహించారు. తరువాత వేదికపై వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు.
అనంతరం వరలక్ష్మీవ్రతంలో భాగంగా భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవివారిని సమంత్రకంగా ఆవాహన చేయడం జరిగింది. తరువాత శ్రీసూక్తవిధానంలో వ్రతకల్పపూర్వకంగా వరలక్ష్మీదేవివారికి షోడశోపచారపూజలు జరిపించారు. అనంతరం అర్చకస్వాములు వ్రతకథను పఠించి వ్రత మహిమా విశేషాలను భక్తులకు తెలియజేశారు. చివరగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేచారు.
వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ, చీర, రవికవస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, వృక్షప్రసాదంగా తులసి మొక్క, పుస్తక ప్రసాదంగా శ్రీశైలప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు అందించారు.
వ్రతానంతరం భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు.. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనం లో భక్తులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.
కాగా భక్తులందరూ వ్రతక్రియను సౌకర్యవంతంగా వీక్షించేందుకు వీలుగా చంద్రవతి కల్యాణ మండపంలో ప్రత్యేకంగా ఎల్.ఈ.డి స్క్రీనును కూడా ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు దంపతులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ మన వైదికసంప్రదాయంలో శ్రావణ మాసాన వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తున్నదని అన్నారు. ఈ శ్రావణమాసం సర్వదేవతా ప్రీతికరంగా చెప్పబడుతోందన్నారు.
ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ వరలక్ష్మీవ్రతాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొనడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారు మహాశక్తి స్వరూపిణి శ్రీభ్రమరాంబాదేవివారు స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీశైలమహాక్షేత్రంలో వరలక్ష్మీవ్రతాన్ని జరిపించుకునే వారందరు కూడా ఎంతో అదృష్టవంతులన్నారు. అందరికీ శ్రేయస్సు కలుగుతుందన్నారు. ధర్మకర్తల మండలి వారి సూచనల మేరకు భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు.
