శ్రీశైల దేవస్థానం:
వేసవి సెలవులు , ప్రభుత్వ సెలవు దినము కావడంతో ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు.
ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్ధం పలు ఏర్పాట్లు చేసినట్లుగా కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు తెలియజేశారు. ముఖ్యంగా భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
సౌకర్యాల కల్పనలో భాగంగా ప్రతి రోజు ఉదయం 6.00 గం. లకు క్యూ కాంప్లెక్స్‌లోని భక్తులకు వేడి పాలు అందజేయటం జరుగుతోందన్నారు. అదేవిధంగా ఈరోజు క్యూ కాంప్లెక్సులో అల్పాహారంగా కట్టుపొంగలి, పులిహోర, పెరుగన్నం అందజేయడం జరిగిందన్నారు. అలాగే వేడిపాలు అందజేసిన తరువాత నిరంతరం మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు భక్తులకు ఇస్తున్నామన్నారు.
అదేవిధంగా ఎండ తీవ్రత కారణంగా క్షేత్రంలో పలుచోట్ల చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసామన్నారు. ఈ చలివేంద్రాలలో చల్లని మంచినీటితోపాటు మజ్జిగ కూడా భక్తులకు అందిస్తున్నామన్నారు.
కాగా వేకువజామున 3.00 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాల సేవలను జరిపించిన అనంతరం వేకువ జామున గం. 4.30ల నుంచి సాయంత్రం గం. 4.30ల వరకు దర్శనాలు కొనసాగించామన్నారు. అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుండి దర్శనాలు కొనసాగుతాయన్నారు.
కాగా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఈ ఉదయం కార్యనిర్వహణాధికారి ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
