శ్రీశైల దేవస్థానం:
• భక్తులు పూర్తిస్థాయిలో సంతృప్తిపడేవిధంగా సౌకర్యాలు మెరుగుపరచాలి
• మెరుగైన సౌకర్యాల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి.
• ప్రాథమిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఉండాలి.
• త్రాగునీరు , పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలి.
– యం. శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి
దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాల పట్ల క్షేత్రాన్ని సందర్శించే భక్తులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందే విధంగా ఆయా ఏర్పాట్లు ఉండాలని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ఆదేశించారు.
ఈ రోజు 10న సాయంకాలం పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో కార్యనిర్వహణాధికారి భక్తులకు సదుపాయాలను సమీక్షించారు. అన్నిశాఖల అధిపతులు, అన్ని విభాగాల పర్యవేక్షకులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అన్ని విభాగాలు కూడా సౌకర్యాల కల్పనే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుండాలని అన్నారు. ముఖ్యంగా దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, ఉచిత ప్రసాదవితరణ, శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం మొదలైన మౌలిక వసతులపై భక్తుల నుంచి 90శాతం సానుకూలత స్పందన ఉండేవిధంగా ఆయా సదుపాయాల కల్పన ఉండాలన్నారు. అందుకు ప్రతీ ఉద్యోగి కూడా తమ విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. విధినిర్వహణలో జవాబుదారీతనం ఉండాలన్నారు.
ముఖ్యంగా క్యూలైన్లు, క్యూకాంప్లెక్సులో నిరంతరం మంచినీటిసరఫరా, అల్పాహారం అందిస్తుండాలని అన్నారు.
అన్నప్రసాద వితరణ భవనములో శుచీశుభ్రతల నిర్వహణ పట్ల ప్రత్యేకశ్రద్ధవహించాలన్నారు. అదేవిధంగా అన్నప్రసాదాలు రుచికరంగా ఉండేవిధంగా ఎప్పటికప్పుడు అధికారులు తగు పర్యవేక్షణను చేస్తుండాలన్నారు.
క్షేత్ర ప్రధాన వీధులే కాకుండా క్షేత్రపరిధిలోని వలయ రహదారి, అంతర్గత రహదారులు మొదలైనచోట్ల కూడా పారిశుద్ధ్యం పకడ్బందిగా ఉండాలన్నారు. సంబంధిత పర్యవేక్షక సిబ్బంది క్షేత్రపరిధిలోని ప్రతీ వీధిలో కూడా నిరంతరం పారిశుద్ధ్య పర్యవేక్షణను చేస్తుండాలన్నారు. చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలన్నారు.
దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా తగు సమయాలలో ప్రసారం చేస్తుండాలన్నారు. దీనివలన భక్తులు ఆయా సదుపాయాలను వినియోగించుకునే వీలు కలుగుతుందన్నారు.
