శ్రీశైల దేవస్థానం:
వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో తగినంత వర్షాలు కురవాలని, పాడిపంటల సంమృద్ధితో దేశం , రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఆగష్టు 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వరుణ యాగం , శ్రీస్వామివారికి సహస్రఘటాభిషేకం, అమ్మవారికి విశేషార్చనలు, కార్యక్రమ సంబంధి హోమాలు, జపాలు, పారాయణలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 10వ తేదీన శ్రీస్వామివారికి ప్రధాన కలశాలతోనూ ,సహస్రఘటాలతో విశేషంగా అభిషేకం జరిపిస్తారు. 11వ తేదీన పూర్ణాహుతి, కలశోద్వాసనతో ఈ కార్యక్రమం ముగియనున్నది.
ఈ సందర్భంగా ఈ రోజు స్థానిక గౌరవశాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేక ఆహ్వాన పత్రికలను శ్రీస్వామిఅమ్మవార్లకు సమర్పించారు.
ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ మహాద్వారం వద్ద ఈ ఆహ్వాన పత్రికలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపించారు.. అనంతరం మేళతాళాలతో సంప్రదాయబద్దంగా రత్నగర్భ గణపతిస్వామివారికి, స్వామిఅమ్మవార్లకు,కుమారస్వామివారికి, నందీశ్వరస్వామివారికి ఈ ఆహ్వానపత్రికలు, ఫలపుష్పాలు, అమ్మవారికి వీటితో పాటు పసుపు, కుంకుమలు సమర్పించారు.
ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, శ్రీమతి బోనేని రమణమ్మ, చిట్టిబొట్ల భరద్వాజశర్మ, శ్రీమతి జి. లక్ష్మేశ్వరి, శ్రీమతి గుల్ల గంగమ్మ, శ్రీమతి కోడె కాంతివర్ధిని, శంకరశెట్టి పిచ్చయ్య, శ్రీమతి జవ్వాజి రేఖాగౌడ్, ఆలా అనిల్‌కుమార్, మేడా మురళీధర్, శ్రీమతి ఉప్పుటూరి సుబ్బలక్ష్మి, శ్రీమతి పి.యూ. శివమ్మ, శ్రీమతి జిల్లెల శ్రీదేవి, ప్రత్యేక ఆహ్వానితులు కారపర్తి నాగేశ్వరరావు, వేమిరెడ్డి కోటారెడ్డి, వాయిగండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అదేవిధంగా దేవస్థాన అర్చక స్వాములు, వేదపండితులు, సంబంధిత అధికారులు, తదితరులు కూడా పాల్గొన్నారు.
