శ్రీశైల దేవస్థానం:ప్రతీ నెలలోనూ ఒక రోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించినందున ఈ రోజు వారికి ఆ సౌకర్యం కల్పించారు.
చెంచు గిరిజనులు ఈ రోజు స్వామివార్ల స్పర్శదర్శనం, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.
స్థానిక చెంచుగూడెములతో పాటు నంద్యాల జిల్లా, మార్కాపురం జిల్లా, పల్నాడు జిల్లాల నుంచి కూడా చెంచు భక్తులు ఈ రోజు స్పర్శదర్శనాన్ని చేసుకున్నారు.
దర్శనానంతరం చెంచు భక్తులందరికీ దేవస్థాన అన్నపూర్ణా ప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేసారు.
ఈ రోజు ఉదయం చెంచు గిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద సిబ్బంది ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి జి. గంగమ్మ కూడా పాల్గొన్నారు.
శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచుగిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకున్నారు.
