శ్రీశైల దేవస్థానం:
కార్తిక మూడవ సోమవారం సందర్భంగా దేవస్థానం రేపు 30న పుష్కరిణి వద్ద లక్షదీపోత్సం , పుష్కరిణి హారతిని నిర్వహిస్తుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారియం. శ్రీనివాసరావు తెలిపారు. లోక కల్యాణం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు.
లక్షదీపోత్సవం:
ఈ దీపోత్సవ కార్యక్రమంలో పుష్కరిణి ప్రాంగణమంతా కూడా దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు.
పుష్కరిణి హారతి
(దశవిధ హారతులు):
అదేవిధంగా సాయంత్రం గం.6.30ల నుండి ముందుగా శ్రీస్వామిఅమ్మవార్లకు , పుష్కరిణికి దశవిధ హారతులు శాస్త్రోక్తంగా సమ ర్పిస్తారన్నారు .కాగా ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి విశేషంగా పూజాదికాలు చేస్తారని తెలిపారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను వుంటాయని చెప్పారు.
అనంతరం ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి,నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూర హారతి సమర్పణ చేస్తారని తెలిపారు.
దశ హారతులు – దర్శనఫలం:
1. ఓంకారహారతి :
పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం.
ఈ ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడతాయి. సకల శుభాలు కలుగుతాయి.
2. నాగహారతి :
ఈ నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది.
3. త్రిశూలహారతి :
ఈ త్రిశూలహారతిని దర్శించడం వలన అపమృత్యువు అంటే అకాల మరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి.
4. నందిహారతి :
ఈ నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండవు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి.
5. సింహహారతి :
ఈ సింహ హారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనో ధైర్యం కలుగుతుంది.
6. సూర్య హారతి :
ఈ సూర్య హారతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది.
7. చంద్రహారతి :
ఈ చంద్రహారతి దర్శించడం వలన మనశ్శుద్ధి కలిగి, ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
8. కుంభహారతి :
ఈ కుంభహారతిని దర్శించడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి.
9. నక్షత్రహారతి :
ఈ నక్షత్ర హారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది.
10. కర్పూరహారతి :
ఈ కర్పూర హారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
కార్తీక మాసోత్సవాలు:
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని , సెలవు రోజు కావడంతో ఈ రోజు భక్తులు వేకువజాము నుండే ఆలయాన్ని సందర్శించారని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారియం. శ్రీనివాసరావు తెలిపారు.
దర్శనం ఏర్పాట్లు:
కార్తీకమాసంలో ప్రభుత్వసెలవుదినాలు, కార్తీక సోమవారాలు , కార్తీక పౌర్ణమి రోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకుంటున్నారని చెప్పారు . భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేశామన్నారు.
దర్శనం ఏర్పాట్లు
ఈ రోజు ఉదయం వేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంత్రం గం. 4.00ల వరకు దర్శనాలను ఏర్పాటు చేశామన్నారు.
అదేవిధంగా ఆలయశుద్ధి, ప్రదోషకాలం అనంతరం సాయంకాలం మహామంగళహారతి సమయం నుండే అనగా సాయంత్రం గం. 5.30ల నుంచి దర్శనాలు జరిగాయని తెలిపారు
స్వామివార్ల అలంకార దర్శనం
భక్తులరద్దీకారణంగా శని,ఆది,సోమవారాలలో , పౌర్ణమి మొదలైన రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేశామన్నారు.భక్తులందరికీ శ్రీస్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకై రద్దీరోజులలో దేవస్థానం శాఖాధిపతులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించామన్నారు.
దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
క్యూలైన్లలో అల్పాహారం
కార్తీకమాసమంతా క్యూకాంప్లెక్స్ లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారంగా కట్టుపొంగలి, పులిహోర, పెరగన్నం, బిస్కెట్లు మరియు మంచినీరు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం వేళలలో వేడిపాలు కూడా ఇస్తున్నామన్నారు.
కార్తీక దీపోత్సవం:
భక్తులు కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధి , గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయన్నారు . అదేవిధంగా గంగాధర మండపం వద్ద పలువురు భక్తులు దీపారాధన చేసుకున్నారు.
అన్నప్రసాద వితరణ
భక్తులకు అన్న ప్రసాద వితరణ భవనంలో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ అవుతోందని తెలిపారు. . అలాగే సాయంత్రం గం. 7.00 నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు వుందన్నారు,
లడ్డు ప్రసాదాలు
కార్తీకమాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 13 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలు ఇస్తున్నామన్నారు. ఇందులో ప్రత్యేకంగా మహిళలకు ఒక కౌంటరు , వృద్ధులకు ఒక కౌంటర్ ఏర్పాటు వుంది.
