శ్రీశైల దేవస్థానం:
గో సంరక్షణకు సమాజంలోని అన్ని వర్గాలు సమష్టిగా ముందుకు రావాలని, బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న ని ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య పిలుపునిచ్చారు. గోవు భారతీయ సంస్కృతి, వ్యవసాయ జీవన విధానంతో ముడిపడి ఉందని, పశువుల సంరక్షణను సామాజిక బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
శ్రీశైలం దేవస్థానం పరిపాలన భవనంలో గురువారం, బహిరంగ ప్రదేశాల్లో పశువుల పరిరక్షణ, గోశాలల నిర్వహణ, పశుగ్రాస లభ్యత తదితర అంశాలపై ‘గో బంధు’ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గోశాలల నిర్వాహకులు, గో సంరక్షకులు పాల్గొన్నారు. తిరుపతి, సింహాచలం దేవస్థానాల కార్యనిర్వహణాధికారులు, పలువురు మున్సిపల్ కమిషనర్లు, వెటర్నరీ కౌన్సిల్ సభ్యులు, గో సంరక్షకులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు.
శ్రీశైలదేవస్థానం తరుపున ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి , డిప్యూటీ కమిషనరు ఎస్. చంద్రశేఖర్, గో సంరక్షణ విభాగపు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
• పశువుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలు, ప్రధాన రహదారులపై బహిరంగంగా సంచరిస్తున్న పశువుల సంరక్షణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డాక్టర్ లక్ష్మయ్య సూచించారు. జిల్లా ఉన్నతాధికారులతో కమిటీలను ఏర్పాటు చేసి పశువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వారు కోరారు. రహదారులపై సంచరిస్తున్న పశువుల వల్ల ప్రమాదాలు జరగకుండా వాటిని గుర్తించి సంరక్షణ కేంద్రాలకు తరలించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పారు.
• పశుగ్రాస లభ్యతపై దృష్టి
ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో పశుగ్రాస లభ్యత తగ్గే అవకాశం ఉందని డాక్టర్ లక్ష్మయ్య పేర్కొన్నారు. దీనిని ముందుగానే గుర్తించి పశుగ్రాస నిల్వలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గోశాలల్లో ఉన్న పశువులకు ఏడాది పొడవునా తగిన మేత అందేలా జిల్లా స్థాయిలో ప్రణాళిక రూపొందించాలని కోరారు.
• గో ఆధారిత వ్యవసాయంతో ఆరోగ్య ప్రయోజనాలు
మానవ ఆరోగ్య పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. గో ఆధారిత వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతోపాటు రైతులకు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గో ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా పశుపోషణకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని వారు పేర్కొన్నారు.
• సంస్కృతిలో గోవుకు ప్రత్యేక స్థానం
గో సంరక్షణ భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో భాగమని ఆర్ఎస్ఎస్ దక్షిణ భారత ప్రచారక్ ఏ. శ్యామ్‌కుమార్ పేర్కొన్నారు. సమాజంలోని అందరిలో పశువుల పట్ల బాధ్యత, కరుణ, సంరక్షణ భావన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గో సంరక్షణను వ్యవసాయం, పర్యావరణం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన అంశంగా చూడాలని సూచించారు.
• ఆర్థిక వ్యవస్థకూ ప్రయోజనం
గో సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. పాలు, పశువుల ఆధారిత ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తే పశుపోషకులు, రైతులకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పశుసంపద కీలకమని పేర్కొన్నారు.
• శ్రీశైలదేవస్థానంలో గో సంరక్షణ :
గోవు సకలదేవతా స్వరూపమని, మన పురాణాలు పేర్కొంటున్నాయని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు పేర్కొన్నారు. అందుకే శ్రీశైలదేవస్థానం గో సంరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. దేవస్థానం గో సంరక్షణశాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. గో సంరక్షణశాలలోని ప్రతి గోవు పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. జాగ్రత్త చర్యలలో భాగంగా గోవులకు, అంటువ్యాధులు , సీజనల్ వ్యాధులు రాకుండా వాటికి కాలానుగుణంగా ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా టీకా మందులు వేయడం జరుగుతుందన్నారు. గోవులకు తగిన మేత, త్రాగునీరు అందించేవిధంగా సంబంధిత సిబ్బంది పర్యవేక్షిస్తుంటారన్నారు. గోవులన్నింటికి పౌష్టికాహారం అందించడం జరుగుతోందన్నారు. భక్తులలో తగు అవగాహన కల్పించేందుకు దేవస్థానం గో ఉత్పత్తులను కూడా విక్రయానికి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి జె.వి. రమణ, ఏపీవీసీ రిజిస్ట్రార్ డాక్టర్ పి.వి. రమణ, సంస్కృతి సేవా సమితి నిర్వాహకులు ఒంటిరు శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు భాగవతుల రవికుమార్, హైకోర్టు న్యాయవాది , కె. ప్రసాదరావు, డా. మధు లత తదితరులు పాల్గొన్నారు.
