శ్రీశైల దేవస్థానం:
శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం:
లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది.
ప్రతి బుధవారం, సంకటహర చవితి రోజులు పౌర్ణమి రోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తున్నారు.
ఈ ఉదయం సాక్షి గణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి విశేషపుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు.
వైదిక సంప్రదాయాలలో గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని చెప్పబడుతోంది. కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని నమ్మకం.
శ్రీశైలక్షేత్ర పరివార ఆలయాలలో సాక్షిగణపతి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లుగా కైలాసంలో పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ధి. అందుకే ఈ స్వామి సాక్షిగణపతిగా పేరొందాడు. చక్కని నల్లరాతితో మలచబడిన ఈ స్వామి ఒకచేతిలో కలం, మరోచేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు.
ఆలయ ప్రాంగణములోని వీరభద్రస్వామికి విశేష పూజలు:
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (0.06.2026) సాయంకాలం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేష పూజలను నిర్వహించింది
ఆలయ ప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తర భాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్టరూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజించడం జరుగుతోంది.
కాగా ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది.
ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది.
కాగా ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను నిర్వహించారు.
తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, పలురకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ మరియు మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం నిర్వహించారు.
ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను జరిపించారు.
భజన కార్యక్రమం:
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) ఈరోజు శ్రీ చెన్నకేశవ భజన మండలి, కర్నూలు వారు భజన కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో కైలాసవాసా గౌరివిలాసా, గిరిజాజీవన శంకరా, శంభో..శివశంభో, స్వామిరారా శివలింగ, శివహర పార్వతీ రమణ, మొదలైన పలు భక్తిగీతాలను, అష్టకాలను నరసింహులు, శంకర్, శ్రీలత , శ్రీనివాసులు, .తదితరులు ఆలపించారు.
ఈ కార్యక్రమములో బి.వి. రమణయ్య, తబల , రిధమ్ పాడ్, బి.జమ్మయ్య సహకరించారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
