శ్రీశైల దేవస్థానం:
దేవస్థానంలోని ప్రతీ ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల కల్పననే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు అన్నారు. ఎప్పటికప్పుడు సౌకర్యాలను మెరుగుపరుస్తుండాలన్నారు.
ఈ రోజు సాయంకాలం పరిపాల నాభవనంలోని సమావేశ మందిరములో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, అన్నిశాఖల అధికారులు, అన్ని విభాగాల పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది, అన్నప్రసాద వితరణ, ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న వంటస్వాములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, ఉచిత ప్రసాద వితరణ, శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ లాంటి మౌలిక వసతులపై భక్తుల నుంచి 90 శాతం సానుకూలత స్పందన ఉండాలన్నారు. అందుకనుగుణంగానే ఉద్యోగులందరు విధులు నిర్వర్తించాలన్నారు.
ఇప్పటికే రాష్ట్రదేవదాయశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర దేవాలయాల పాలనా సంస్థ ( SITA – STATE INSTIUTE OF TEMPLE ADMINISTRATION) వంట స్వాములకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. తదనుగుణంగా వంటస్వాములు అన్నప్రసాదాలను, ఆలయంలోని ప్రసాదాలను తయారు చేయాలన్నారు.
ముఖ్యంగా వంటకాల ప్రామాణీకరణపట్ల శ్రద్ధ వహించాలన్నారు ఈ ఓ. ఒక వంటకాన్ని ప్రతీసారి ఒకేరుచి, నాణ్యత మరియు పరిమాణంతో తయారు చేయడానికి అనుసరించే విధానాన్ని వంటకాల ప్రామాణీకరణగా పేర్కొంటారన్నారు.
అదేవిధంగా వంటకాల తయారీలో ప్రామాణీక నిర్వహణ విధానం ( SOP – Standard Operating Procedure) ఉండాలన్నారు.
కాగా అన్నప్రసాద వితరణలో ప్రతీరోజు కూడా తాజా కూరగాయలను మాత్రమే వాడాలన్నారు. కూరగాయలను కూడా తగు విధంగా తరగాలన్నారు. సంబంధిత అధికారులు కూడా కూరగాయలను తరగడాన్ని జాగ్రత్తగా పరిశీలించాలన్నారు.
ముఖ్యంగా వంటశాలలో శుచీశుభ్రత నిర్వహణపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ముఖ్యంగా అన్నప్రసాద వితరణలో భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు. వడ్డన సమయంలో ఆత్మీయంగా ఆయా వంటకాలను వడ్డిస్తుండాలన్నారు. ప్రతీహాలులో కూడా అన్నప్రసాదాల వడ్డన సజావుగా జరిగేటట్లు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. ప్రతీ హాలును కూడా సిబ్బంది ప్రత్యేకంగా నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు.
