శ్రీశైల దేవస్థానం:
* చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమం
• హిందూ ధర్మప్రచారంలో భాగంగా చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలు
• ఈ రోజు స్థానిక మేకలబండలో ప్రారంభమైన ధర్మప్రచార కార్యక్రమం
• ముందుగా బయలువీరభద్రస్వామివారి ఆలయం నుంచి నిర్వహించిన శోభాయాత్ర
• మేకలబండ చెంచుగూడెంలో శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం
• 7వ తేదీన మార్కాపురం జిల్లా చింతలలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమం
హిందూ ధర్మప్రచారంలో భాగంగా పలు చెంచు గూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ రోజు స్థానిక మేకలబండ చెంచుగూడెంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు.
కార్యక్రమములో దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, స్థానిక ఐ.టి.డి.ఎ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్. నాయుడు, ఏ.పి.డి కె.పి. నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి గుల్ల గంగమ్మ, శ్రీమతి కోడె కాంతివర్థిని, దేవస్థానం అధికారులు, సంబంధిత దేవస్థానం సంబంధిత సిబ్బంది, ఐ.టి.డి.ఎ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ధర్మప్రచారంలో ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ బయలువీరభద్రస్వామికి విశేషపూజాదికాలు నిర్వహించారు. శ్రీబయలువీరభద్రస్వామివారి ఆలయం నుంచి మేకలబండ చెంచుగూడెంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ వేదిక వద్ద వరకు దేవస్థానం ధర్మప్రచారరథంతో శోభాయాత్ర నిర్వహించారు.
కాగా శోభాయాత్ర నిర్వహించిన మేకలబండ చెంచుగూడెం ప్రధానవీధిని చెంచుభక్తులు పలురకాల రంగవల్లులతో తీర్చిదిద్దారు.
శోభాయాత్ర తరువాత కల్యాణోత్సవం ప్రారంభించారు.
ఈ కార్యక్రమములో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ కల్యాణోత్సవ సంకల్పం పఠించి అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా శుభప్రదంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు.
అనంతరం కంకణపూజ కార్యక్రమాన్ని జరిపి శ్రీ స్వామివారికి కంకణధారణ చేశారు. ఆ తరువాత యజ్ఞోపవీత పూజ జరిపి శ్రీ స్వామివారికి యజ్ఞోపవీ తధారణ కార్యక్రమం జరిపించారు.
శ్రీస్వామివారి యజ్ఞోపవీత ధారణ అనంతరం కన్యావరణం కార్యక్రమం, గౌరీపూజ, అమ్మవారి కంకణ ధారణ కార్యక్రమాలు జరిపించారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్ల ప్రవర అనంతరం స్వామివారికి వరపూజ నిర్వహించి శ్రీ స్వామిఅమ్మవార్లకు బాషికాలను అలంకరించారు.
తరువాత ఈ భూమండలం , శ్రీశైలక్షేత్ర వర్ణనతో కూడిన మహాసంకల్పం పఠించారు.
మహాసంకల్ప పఠన తరువాత అర్చకస్వాములు మంగళాష్టకాలను పఠిస్తూ సుముహూర్త సమయంలో శ్రీ స్వామిఅమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సమర్పించారు .
అనంతరం లోకకల్యాణం కోసం అమ్మవారికి మాంగల్యధారణ తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు తలంబ్రాలను సమర్పించారు.
ఆ తరువాత శ్రీ స్వామిఅమ్మవార్ల వస్ర్తాల కొంగులను కలుపుతూ బ్రహ్మముడి వేసారు. చివరగా శ్రీ స్వామిఅమ్మవార్లకు పున:పూజలు జరిపి ఆశీర్వచనం, భక్తులకు ప్రసాద వితరణ చేసారు.
పాల్గొన్న చెంచు భక్తులందరికీ కూడా ఆశీర్వచనముతో శేషవస్త్రాలను (పురుషులకు పంచ – కండువా మరియు మహిళలకు చీర – రవిక వస్త్రము) అందించారు.
