శ్రీశైల దేవస్థానం:
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా పలు చెంచు గూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేశారు.
ఇందులో భాగంగా మే 6వ తేదీన స్థానిక మేకలబండ,చెంచుగూడెములో , మే 7వ తేదీన మార్కాపురం జిల్లా చింతలలో ఈ ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా సాయంకాలం శోభాయాత్ర ఆ తరువాత శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం వుంటాయని వివరించారు.
ఈ కార్యక్రమ నిర్వహణకు ఇప్పటికే దేవస్థాన అధికారుల సమన్వయ బృందం స్థానిక మేకలబండ, చింతలలో పర్యటించిందని తెలిపారు . అదేవిధంగా ఆయా చెంచుగూడెములలో స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఏ) వారి సహకారం కూడా పొందడం జరుగుతోందన్నారు.
ఈ కార్యక్రమములో పాల్గొనే చెంచు భక్తులందరికీ కూడా దేవస్థానం ఆశీర్వచనముతో శేషవస్త్రాలను (పురుషులకు పంచ – కండువా మరియు మహిళలకు చీర – రవిక వస్త్రము) అందిస్తామన్నారు.
కాగా శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో గిరిజన చెంచులకు ఎంతో ప్రత్యేకస్థానం వున్నది. చెంచు భక్తులు ఈ క్షేత్రాధిదేవత అయిన శ్రీభ్రమరాంబాదేవివారిని తమ కుమార్తెగా, క్షేత్రాధిదేవుడైన శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిగా భావిస్తారు. ఇందుకు సంబంధించిన జానపద కథలు కూడా శ్రీశైల సంబంధి సాహిత్యంలో ఎంతో విశేషంగా ఉన్నాయి.
ఈ ప్రసిద్ధకథను తెలియజేసే శిల్పాలను కూడా మనం శ్రీశైల ప్రధానాలయ ప్రాకారంపై చూడవచ్చు.
కాగా నల్లమల ప్రాంతంలోని చెంచు భక్తులకు శ్రీశైల మల్లికార్జునుడే ఆరాధ్య దైవం. పలువురు చెంచు కుటుంబాల వారు శ్రీశైలమల్లికార్జునస్వామివారిని ఇలవేల్పుగా భావిస్తారు.
