శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మల్లికార్జునస్వామివారి పరమ భక్తులలో ఒకరైన అక్కమహాదేవి జయంత్యోత్సవం చైత్ర పౌర్ణమి సందర్భంగా బుధవారం 1 న ఉదయం గం.9.00 నుండి సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. ఈ జయంత్యోత్సవంలో ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవికి అభిషేకం, విశేషార్చనలు జరిపిస్తారు.
కాగా 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతాన శివశరణులుగా ప్రసిద్ది పొందిన మహాభక్తులలో అక్కమహాదేవి ఒకరు. వీరవిరాగిణిగా పేరొందిన అక్కమహాదేవి శ్రీశైలమల్లికార్జునస్వామివారిని తమ జీవిత భాగస్వామిగా భావించి తరించింది.
శ్రీశైల మల్లికార్జునుడిపై ఎన్నో వచనాలను చెప్పిన అక్కమహాదేవి సంస్కృత,కన్నడ భాషలలో ఎంతో ప్రవీణురాలని చెప్పబడుతోంది. కన్నడ వచన సారస్వతంలో ఈమెను విశిష్ట వచనా రచయిత్రిగా సాహితీవేత్తలు పేర్కొంటారు. ఇప్పటికీ అక్కమహాదేవి వచనాలు శివశరణాలనే పేరుతో ఎంతో ప్రచారంలో ఉన్నాయి. ఈ వచనాలలో మధుర భక్తే కాకుండా జ్ఞాన, వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నో అంశాలు కనిపిస్తాయి.
శ్రీశైల మల్లికార్జునునిలో ఐక్యం కావాలనే చిరకాల వాంఛ గల అక్కమహాదేవి తన జీవితపు చివరి రోజులను శ్రీశైలంలోనే గడిపింది. ప్రస్తుతం అక్కమహాదేవి గుహలుగా పిలువబడుతున్న ఇక్కడి గుహలలో కొంత కాలం తపస్సు చేసిన ఈ సాధకురాలు ఇక్కడి కదళీవనంలో మరికొంత కాలం తపస్సు చేసి, ఈ కదళీవనంలోనే సిద్ధి పొందిందని చెప్పబడుతోంది.
అక్కమహాదేవిజయంతిని పురస్కరించుకుని రేపు సాయంకాలం నిత్యకళారాధన వేదికపై అక్కమహాదేవి జీవిత విశేషాలపై ప్రవచన కార్యక్రమము ఏర్పాటు చేశారు.
