రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు
‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‘ మహా భరోసా..
- 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు సంపూర్ణ నగదు రహిత వైద్యం
- సీజీహెచ్ఎస్ (CGHS) ప్యాకేజీల కింద 1,816 రకాల చికిత్సలు
- గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ. 10 వేల కోట్ల బిల్లుల చెల్లిస్తోన్నాము
- సచివాలయంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక భరోసా, నమ్మకం కలిగిస్తూ, ఎలాంటి భయాందోళనలు లేని ఒక చక్కటి ఆరోగ్య భద్రత వ్యవస్థను అందించాలనే సదుద్దేశంతో ప్రజా ప్రభుత్వం *’న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’*ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే వైద్య ఖర్చుల కోసం అప్పులపాలై, వాటిని తీర్చలేక సతమతమవుతున్న దుస్థితిని మేము గమనించాం. ఈ పరిస్థితిని మార్చి, వారికి సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. శుక్రవారం రాష్ర్ట సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మతో కలిసి ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను ప్రారంభించి ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి ఈ పథకమే నిదర్శనమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం.. మానవీయ కోణంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఉద్ఘాటించారు.
‘‘ఉద్యోగులు కూడా మన కుటుంబ సభ్యులేనని, వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని, ఉప ముఖ్యమంత్రి హోదాలో నేను ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి ఛైర్మన్గా బాధ్యతలు తీసుకోగా, నా సహచర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , శ్రీమతి సీతక్క సభ్యులుగా వ్యవహరించారు. మేమందరం ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, పకడ్బందీ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాని ప్రతిరూపమే ఈ ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’’’ అని వివరించారు.
సుమారు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారిపై ఆధారపడిన 29.80 లక్షల మంది కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 886 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉచిత ఇన్పేషెంట్ వైద్య సేవలు పొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) ప్యాకేజీ రేట్లకు అనుగుణంగా 1,816 రకాల వైద్య, శస్త్రచికిత్సలను ఈ పథకం కవర్ చేస్తుందని వివరించారు. ఈ పథకం పారదర్శకంగా, సజావుగా సాగేందుకు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమాన భాగస్వామ్యంతో ఒక ప్రత్యేక ‘ట్రస్ట్’ ను ఏర్పాటు చేశామన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం – మా ప్రభుత్వ చిత్తశుద్ధి
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తమ ఆరోగ్య భద్రత కోసం సకల జనుల సమ్మెతో సహా ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం శూన్యమని విమర్శించారు. పదేళ్ల పాటు ఉద్యోగుల విజ్ఞప్తులను బుట్టదాఖలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు రూ. 10 వేల కోట్ల బిల్లులను తమ ప్రభుత్వం మానవీయ కోణంలో క్లియర్ చేస్తోందన్నారు.
“ఆసుపత్రి పాలై అప్పులపాలైన ఉద్యోగి కళ్లల్లో ఆందోళన ఉంటే ప్రభుత్వానికి సరైన ఔట్పుట్ ఇవ్వలేడు. అందుకే నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులను నెలకు రూ.2000 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తున్నాం. ప్రతి 15 రోజులకోసారి నేనే (భట్టి విక్రమార్క) స్వయంగా సమీక్షిస్తూ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా చూస్తున్నాను,” అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతతో రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు భట్టి తెలిపారు. అందులో భాగంగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని, అర్హులైన 1.06 కోట్ల కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఇంతటి చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేపథ్యంలో, ప్రతి ఉద్యోగి రెట్టింపు ఉత్సాహంతో, నిబద్ధతతో పనిచేయాలని డిప్యూటీ సీఎం కోరారు. పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఉచిత విద్యుత్, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చడంలో ఉద్యోగులే నిజమైన వారధులుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరి డా. క్రిస్టినా జడ్ చోంగ్తూ, ఎడ్యూకేషన్ సెక్రటరి యోగిత రాణా, స్పెషల్ ఛీఫ్ సెక్రటరి జీఏడి బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరి సందీప్ కుమార్ సుల్తానియా, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
