శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రాన్ని దర్శించే భక్తుల రద్దీ రోజురోజుకు అనూహ్యంగా పెరుగుతున్న కారణంగా సామాన్య భక్తుల సౌకర్యార్థం శని,ఆది,సోమవారాలలో విరామ దర్శన విధానంలో మార్పులు చేసినట్లుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు ,కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేశారు.
శని,ఆది,సోమవారాలలో ఉదయం వేళలలో మనమిత్ర వాట్సప్ , ఆన్లైన్ ద్వారా స్పర్శదర్శనం టికెట్లను ముందస్తుగా పొందిన భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తారన్నారు.
అదేవిధంగా ప్రముఖులు స్వయంగా విచ్చేసినప్పుడు మాత్రమే ఉదయం వేళలలో ప్రాధాన్యతను బట్టి ప్రముఖులకు ఈ స్పర్శదర్శనం ఏర్పాటు వుంటుందన్నారు.
ప్రముఖులు అందజేసే సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు అవకాశాన్ని బట్టి రాత్రివేళలలో , రాత్రి గం.9.00ల నుంచి మాత్రమే స్పర్శ దర్శనానికి వీలు కల్పించడం జరుగుతుందన్నారు. సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు ఉదయం వేళలలో స్పర్శదర్శనానికి అవకాశం ఉండదన్నారు.
ఈ మార్పుల వల్ల సర్వదర్శనం క్యూలైన్లలోని ( ఉచిత దర్శనం క్యూలైన్ ) సాధారణ భక్తులు , శీఘ్ర, అతిశీఘ్ర దర్శన భక్తులు అధిక సమయం వేచివుండకుండా శ్రీస్వామిఅమ్మవార్లను మరింత సులభతరంగా దర్శించుకునే అవకాశం కలుగుతుందన్నారు.
భక్తులు ఈ మార్పులు గమనించి దేవస్థానానికి సహకరించాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు , కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.
