శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రాభివృద్ధి మాస్టర్‌ప్లాన్ పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు అధ్యక్షన ధర్మకర్తల మండలి 5వ సమావేశం బుధవారం జరిగింది.దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈనాటి సమావేశంలో మొత్తం 28 అంశాలు చర్చించారు. వీటిలో 23 అంశాలు ఆమోదించారు. మిగతా వాటిలో 4 అంశాలను వాయిదా వేసారు. ఒక అంశం తిరస్కరించబడింది.
సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు.
• క్షేత్రంలో సందర్శించే సామాన్య భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి సమావేశంలో కూలంకుషంగా చర్చించారు.
• క్షేత్రాభివృద్ధి , సౌకర్యాల కల్పనకుగాను రాబోవు 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మాస్టర్‌ప్లాన్ తుదిరూపం ఇచ్చేందుకు నిర్ధారణకు డి.పి.ఆర్ ( DETAILED PROJECT REPORT) పరిశీలించి సుదీర్ఘంగా చర్చించారు.
• ముఖ్యంగా సామాన్య భక్తులకు సౌకర్యాలకు సంబంధించి డార్మెటరీ నిర్మాణం, శౌచాలయాలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు మొదలైనవాటికి మొదటి ప్రాధాన్యతను మాస్టరుప్లానులో ఇవ్వాలని నిర్ణయించారు.
• అదేవిధంగా శ్రీశైలక్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిర్మాణాలను కూడా మాస్టర్ ప్లానులో పొందుపరచాలని నిర్ణయించారు.
• మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు , క్షేత్ర సుందరీకరణకు కూడా తగు చర్యలు చేపట్టేవిధంగా ఆయా అంశాలను మాస్టరుప్లానులో పొందుపరిచేందుకు నిర్ణయం.
• మల్లమ్మ కన్నీరు సమీపంలో గల పురాతన కాలభైరవ ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
• పరిపాలనాంశాలలో భాగంగా గో సంరక్షణశాలలోని గోవులకు గ్రాసాన్ని సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచేందుకు ఆమోదించడం జరిగింది.
• భక్తులకు అందజేసే కైలాస కంకణాల సరఫరాకు టెండర్లు ఆహ్వానించేందుకు తీర్మానించారు. ఈ కైలాస కంకణాల రూపకల్పనకు ధర్మకర్తల మండలి ఉపసంఘం, వైదిక సిబ్బంది, దేవస్థానం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసారు.
• అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్‌లో భాగంగా మురుగునీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహణకు ఆపరేషన్ చార్జీలకు సంబంధించి టెండర్లను పిలవాలని నిర్ణయించారు.
