శ్రీశైల దేవస్థానం:ఉగాది మహోత్సవాల మూడవ రోజైన బుధవారం శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రత్యేక్యపూజలు జరిపించారు. ఆ తరువాత స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు, రుద్రహోమం నిర్వహించారు.
ఉదయం అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిపారు.
ఉత్సవములో భాగంగా అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు చేసారు. సాయంత్రం 5.30గంటలకు సాయంకాల పూజలు,జపానుష్ఠానములు జరిపించారు,
ప్రభోత్సవం:
ఉగాది మహోత్సవాలలో భాగంగా ఈ రోజు సాయంకాలం గం.5.30లకు శ్రీస్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం నిర్వహించారు.
రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు బంతి, చేమంతి, గులాబీ, సుగంధాలు, కనకాంబరాలు మొదలైన 11 రకాల పుష్పాలతో పుష్పాలంకరణ చేసారు.
నందివాహన సేవ:
ఈ మహోత్సవాలలో వాహన సేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ జరిపించారు.
ఈ సేవలో శ్రీస్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను నందివాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి, తరువాత గ్రామోత్సవం జరిపించారు.
నందివాహనాధీశులైన శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించడం వలన చేపట్టిన పనులలో విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం.
మహాసరస్వతి అలంకారం:
ఉగాదిమహోత్సవాలలో అలంకారాలలో భాగంగా ఈ రోజు సాయంకాలం అమ్మవారి ఉత్సవ మూర్తిని మహాసరస్వతి స్వరూపంలో అలంకరింపజేసారు.
చతుర్భుజాలు కలిగి ఉండి, వీణ, అక్షమాల పుస్తకాన్ని ధరించిన ఈ దేవిని దర్శించడం వలన విద్యాప్రాప్తితో పాటు అభీష్టాలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది.

అదే విధంగా గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం తదితర కళారూపాలను ఏర్పాటు చేసారు.
అగ్నిగుండ ప్రవేశం:
ఈ రోజు రాత్రి గం.10.00లకు శివదీక్షా శిబిరాల వద్ద కన్నడ భక్తులచే అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం ప్రత్యేకం. వీరాచార సంప్రదాయాన్ని అనుసరించి జరిపే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అగ్నిగుండ ప్రవేశానికి ముందు వీరాచార విన్యాసాలు ప్రత్యేకం.
కర్ణాటకకు చెందిన వీరశైవ భక్తులు వీరభద్ర వచనాలను పఠిస్తూ, ప్రత్యేక వేషధారణలతో, వివిధ వాయిద్యాల నడుమ విన్యాసాలు ప్రత్యేకం. వీరిని పురవంతులు అని పిలుస్తారు
