శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రం పరమ పవిత్రమైన క్షేత్రమని శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు అన్నారు. ఆదివారం ఉదయం గం. 11.00ల నుంచి దేవస్థానం పరివార దేవాలయమైన ఫాలధార – పంచధార వద్ద శ్రీ శారదాంబా సహిత జగద్గురు ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది.
జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు, దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం వారి కరకమలములచే ఈ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది.
ముందుగా ఈ ఉదయం గం. 8.00లకు ముందుగా ఫాలధార – పంచధార వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో అధివాసహోమాలు, నూతన విగ్రహాలకు నేత్రోన్మీలనము అనంతరం పూర్ణాహుతి జరిగాయి.
తరువాత ఉదయం. గం. 11.00ల నుంచి 12. 30 వరకు ఫాలధార – పంచధారలోని నూతన ఆలయం లో విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేదపండితులు, పలువురు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు అనుగ్రహభాషణం చేశారు. శ్రీశైల మహాక్షేత్రం పరమ పవిత్రమైన క్షేత్రమన్నారు. ఆదిశంకరభగత్పాదులవారు ఇక్కడి ఫాలధార – పంచధార వద్ద తపస్సును ఆచరించి శ్రీస్వామిఅమ్మవార్లను సేవించారన్నారు. అదేవిధంగా శివానందలహరి స్తోత్రాన్ని ఫాలధార – పంచధార వద్దనే రచించారన్నారు. ఇంకా తమ అనుగ్రహభాషణంలో శ్రీశైలక్షేత్ర మహిమావిశేషాలు, దక్షిణామూర్తితత్త్వం, అద్వైతతత్త్వం, శివానందలహరి స్తోత్ర గొప్పతనం మొదలైన అంశాలను వివరించారు.
కాగా మూడు రోజులపాటు నిర్వహించిన ఈ ప్రతిష్ఠా కార్యక్రమం మార్చి 6వ తేదీన ప్రారంభించి ఘనంగా ముగించారు.
మొదటిరోజున మార్చి 6వ తేదీన యాగశాల ప్రవేశం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, మండపారాధన, చతుర్వేదపారాయణలు, నూతన విగ్రహాలకు జలాధివారం క్షీరాధివాసం, అధివాసహోమాలు జరిపించారు. రెండవ రోజైన మార్చి 7వ తేదీన నూతన విగ్రహాలకు ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయాధివాసం, అధివాస హోమాలు జరిపారు. ఆదివారం కార్యక్రమాలు శాస్త్ర రీత్యా జరిగాయి.
