శ్రీశైల దేవస్థానం:
లోకకల్యాణంకోసం దేవస్థానం గురువారం ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.
ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం వుంటుంది .
ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు.
లోకోద్ధరణకోసమై బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు.
కాగా శ్రీశైల క్షేత్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.
ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు.
కాగా దత్తాత్రేయస్వామివారు కలియుగంలో గోదావరితీరాన పిఠాపురంలో శ్రీపాదవల్లభునిగా జన్మించారు. వీరు ఒకసారి శ్రీశైలక్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురుచరిత్రలో చెప్పబడింది.
కాగా శ్రీపాదవల్లభుడు తమ శిష్యులకు ఆయా తీర్థక్షేత్రాల మహిమావిశేషాలను పేర్కొనే సందర్భంలో కూడా శ్రీశైలాన్ని పలుసార్లు ప్రస్తావించారు.
శ్రీపాదవల్లభుల జన్మ తరువాత మహారాష్ట్రలోని కరంజినగరములో నృసింహసరస్వతి స్వామిగా దత్తాత్రేయస్వామివారు జన్మించారు.
