మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగవ రోజు బుధవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. తరువాత యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు .
అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు.
ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు.
మయూర వాహనసేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు మయూర వాహనసేవ జరిపారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరిపారు.
గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేశారు.
*కాణిపాక దేవస్థానం వారు పట్టువస్త్రాలు సమర్పించారు.
*
శివానందలహరి – సౌందర్యలహరి దివ్యప్రవచనం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హిందూ ధర్మప్రచారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో పలువురి ప్రఖ్యాత పండితుల ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు అయ్యాయి.
ఇందులో భాగంగా రెండు రోజుల పాటు అనగా నిన్న , ఈ రోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే “సౌందర్యలహరి –శివానందలహరి” దివ్యప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
జగద్గురుమఠం ముందు భాగంలో ఖాళీ ప్రదేశంలో ప్రత్యేక వేదికను ఏర్పరచి ఈ ప్రవచన కార్యక్రమము నిర్వహించారు.
ఈ రోజు రాత్రి జరిగిన రెండవ రోజు కార్యక్రమములో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా జ్యోతి ప్రజ్వలన జరిపారు.
అనంతరం ప్రవచన కర్త ప్రవచనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదిశంకరుల వారు శివానందలహరిలో పరమేశుని తత్వాన్ని, మహిమా విశేషాలను పలువిధాలుగా తెలియజెప్పారన్నారు. పరమేశుని సర్వలోక రక్షకునిగా పేర్కొనడం జరిగిందన్నారు.
అదేవిధంగా ప్రసoగానుసారంగా పరమేశుని హాలాహల భక్షణం , పరమేశుని పంచభూత తత్త్వం మొదలైన శివలీలను వివరించారు. అదేవిధంగా సౌందర్యలహరిలోని అమ్మవారి తత్వాన్నీ తెలియచెప్పారు.
తమ ప్రవచనములో శ్రీశైల క్షేత్ర మహిమా విశేషాలను కూడా వివరించారు.
కార్యక్రమము చివరిలో ప్రవచన కర్త వారిని దేవస్థానం సత్కరించింది.
*సమీక్ష *
ఈ రోజు సాయంత్రం శ్రీశైలంలోని ప్రధాన ఆలయంలో సమీక్ష జరిగింది. శివరాత్రి రోజు జరుగనున్న పాగాలంకరణ కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను దేవస్థాన అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా , జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ సమీక్షించారు.పాగాలంకరణ కార్యక్రమం సమయానికి సక్రమంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని వారు సమగ్రంగా పరిశీలించారు.అనంతరం ఆలయ క్యూ లైన్ల నుండి చివరి ఎగ్జిట్ పాయింట్ వరకు భక్తుల రాకపోకల నిర్వహణ, భద్రతా చర్యలు, త్రాగునీరు, వైద్య సదుపాయాలు, శుచిత్వం, మార్గదర్శక బోర్డులు వంటి అంశాలపై దేవస్థాన సిబ్బందితో సమీక్ష జరిగింది.భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి వెళ్లేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్.