శ్రీశైలం / నంద్యాల, ఫిబ్రవరి 11 :-ప్రశాంత వాతావరణంలో దర్శనాలు జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు.
శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ బుధవారం సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని క్యూలైన్లు, ట్రాఫిక్ నిర్వహణ, దర్శనాల ఏర్పాట్లు, అన్నదాన భోజనాల వసతులు, పార్కింగ్ ప్రదేశాలు, నడకదారి భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, తాగునీరు, వైద్య శిబిరాలు తదితర సదుపాయాలను సిసి కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ముఖ్యంగా తొక్కిసలాటకు అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో దర్శనాలు జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నడకదారిలో వచ్చే భక్తులకు ప్రత్యేక వైద్య బృందాలు, మొబైల్ అంబులెన్సులు, తాగునీటి సదుపాయాలు, శుచితా ఏర్పాట్లు, భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనాలను నియంత్రిత పార్కింగ్ ప్రదేశాలకు మళ్లిస్తున్నామని, భక్తులు పోలీసు సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. క్యూలైన్లలో తొందరపడకుండా, చిన్నపిల్లలు మరియు వృద్ధులను ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎక్కువసేపు ఎండలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత తాగునీరు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన పక్షంలో వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లు, పబ్లిక్ అనౌన్స్మెంట్ వ్యవస్థలను వినియోగించుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ స్పందన కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి, భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.
