శ్రీశైలం/నంద్యాల, ఫిబ్రవరి 11 :-అవసరమైతే అదనపు బస్సులు నడపాలని కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు.
శ్రీశైలానికి భారీగా తరలివస్తున్న భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బుధవారం శ్రీశైలంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బస్సుల ఫ్రీక్వెన్సీ, రాకపోకల సమయాలు, వివిధ ప్రాంతాలకు బయలుదేరే బస్సుల షెడ్యూల్ తదితర అంశాలపై ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో బస్సులు సమయపాలన పాటిస్తున్నాయా లేదా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయా అన్న విషయాలను ప్రయాణికులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి తెలుసుకున్నారు. భక్తులకు స్పష్టమైన సమాచారం అందించేందుకు బస్టాండ్‌లో సమర్థవంతమైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి, ఏ బస్సు ఏ ప్లాట్‌ఫారమ్ వద్దకు వస్తుందో, ఏ సమయానికి బయలుదేరుతుందో నిరంతరం ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రద్దీ సమయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు.
ప్రయాణికులకు కూర్చునే సదుపాయాలు తగినంతగా ఉన్నాయా లేదా, పారిశుధ్య పరిస్థితి ఎలా ఉందో, టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా జరుగుతోందా లేదా అన్న విషయాలను పరిశీలించారు. బస్టాండ్‌లో ఫ్యాన్లు సక్రమంగా పనిచేయాలనీ, త్రాగునీటి సదుపాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా, అవసరమైతే అదనపు బస్సులు నడపాలని, రాత్రి వేళల్లో కూడా సేవలను బలోపేతం చేయాలని ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచించారు.
