శ్రీశైల దేవస్థానం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హిందూ ధర్మప్రచారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో పలువురి ప్రఖ్యాత పండితుల ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు అయ్యాయి.
ఇందులో భాగంగా రెండు రోజుల పాటు మంగళవారం, బుధవారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే “సౌందర్యలహరి –శివానందలహరి” దివ్య ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
జగద్గురు మఠం ముందు భాగంలో ఖాళీ ప్రదేశంలో ప్రత్యేక వేదికను ఏర్పరచి ఈ ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ రోజు రాత్రి జరిగిన మొదటి రోజు కార్యక్రమములో సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన జరిపారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమములో ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ధర్మకర్తల మండలి అద్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అనంతరం ప్రవచన కర్త ప్రవచనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి మాట్లడుతూ ఆదిశంకరుల వారు రచించిన శతాధిక గ్రంథాలలో సౌందర్యలహరి–శివానందలహరి” ఎంతో ప్రసిద్ధి చెందాయన్నారు. శివుని ఆలంబనగా చేసుకొని శివానందలహరి రచించబడగా, అమ్మవారివి ఆలంబనగా చేసుకొని సౌందర్యలహరి రచించబడిందన్నారు.
సాధారణంగా తమ గ్రంథాలలో నేరుగా ఏ క్షేత్రాన్ని కూడా ప్రస్తావించని శంకరుల వారు శివానందలహరిలో శ్రీశైల క్షేత్రాన్ని, క్షేత్రాధి దేవులైన భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను ప్రస్తావించడం ఎంతో విశేషం అన్నారు.
