శ్రీశైల దేవస్థానం:

















మహాశివరాత్రిని పురస్కరించుకని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు ( 08.02.2026 నుండి18.02.2026 వరకు) నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమ శాస్త్రానుసారం జరిపారు.
ప్రారంభ పూజలలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారియం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, సంబంధిత అధికారులు, స్థానాచార్యులు ( అధ్యాపక), అర్చక స్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.
యాగశాల ప్రవేశం :
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.
వేదస్వస్తి :
ఆలయప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు చతుర్వేద పారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.
శివసంకల్పం :
వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యుల ( అధ్యాపకులు) వారు లోకక్షేమాన్నికాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠించారు. దీనికే శివసంకల్పం అని పేరు. ఈ సంకల్పంలో, దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్ప పఠనం చేశారు.
పుణ్యాహవచనం :
గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం జరిపారు. వృద్ధి , అభ్యుదయాల కోసం ఈ పుణ్యాహవచనం జరిపారు.
చండీశ్వరపూజ :
సంకల్ప పఠనం తరువాత చండీశ్వరపూజ జరిపారు. ఈ బ్రహ్మోత్సవాలు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో, క్షేత్ర పాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివ పరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో నిర్వహించబడుతాయని చెప్పబడుతోంది.
అందుకే యాగశాల ప్రవేశం తరువాత చండీశ్వరుని ప్రత్యేకంగా పూజాదికాలు జరిపించడం సంప్రదాయం.
కంకణ పూజ, కంకణధారణ
చండీశ్వరపూజ తరువాత కంకణాలకు (రక్షాబంధనాలకు) శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపారు. తరువాత కంకణ ధారణ జరిగింది.
ఋత్విగ్వరణం :
కంకణ ధారణ తరువాత ఋత్విగ్వరణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ఆయా వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని ఋత్విక్కులను ఆహ్వానిస్తూ వారికి దీక్షా వస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
అఖండస్థాపన :
ఋత్విగ్వరణం తరువాత అఖండ దీపస్థాపన చేసారు. అనంతరం వాస్తుపూజ జరిపారు. తరువాత వాస్తు హోమం నిర్వహించారు.
రుద్రకలశస్థాపన :
వాస్తు హోమం తరువాత మండపారాధన చేసి రుద్ర కలశస్థాపన చేసారు . కలశ స్థాపన తరువాత కలశార్చన జరిపారు. తరువాత పంచావరణార్చనలు నిర్వహించారు.అనంతరం లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు జరిపించారు.
అంకురార్పణ :
బ్రహ్మోత్సవాల మొదటిరోజు సాయంకాలం అంకురార్పణకు ఎంతో విశేషముంది. ఈ కార్యక్రమములో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చారు. దీనినే “ మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో (మూకుళ్ళలో) నింపి, దాంట్లో నవ ధాన్యాలను పోసి, ఆ మట్టిలో మొలకెత్తించే పనిని ప్రారంభించారు . ఈ అంకురారోపణ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి, శుక్లపక్ష చంద్రునివలే పాలికలలోని నవధ్యానాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు.
ధ్వజారోహణ :
బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు సాయంకాలం ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ ఈ ధ్వజారోహణ.
ఈ కార్యక్రమంలో ఒక కొత్త వస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుని చిత్రీకరించారు. దీనికే నంది ధ్వజపటం అని పేరు. దీనిని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన ప్రత్యేక తాడును సిద్ధం చేశారు. తరువాత నంది ధ్వజపటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తెచ్చి చండీశ్వరస్వామి సమక్షములో పూజాదికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమములోనే భేరీపూజ కూడా నిర్వహించారు.
ఈ భేరీపూజలో డోలు వాద్యానికి పూజాదికాలు జరిపారు. తరువాత నాద స్వరంపై ఆయా రాగాల ఆలాపనతో ఆయాదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. చివరగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు.
ధ్వజస్తంభం మీద ఎగిరే ఈ నందిపతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానం అన్నమాట. ఈ ఆహ్వానంతో విచ్చేసిన దేవతలకు నిర్ణీత స్థలాలు కేటాయించి, రోజూ పద్ధతి ప్రకారంగా వారికి నివేదన సమర్పిస్తారు. బ్రహ్మోత్సవ సమయములో దేవతలంతా క్షేత్రంలోనే వుంటూ ఉత్సవాన్ని తిలకిస్తారని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి.
ధ్వజారోహణ కార్యక్రమములో ఉత్సవాల ప్రత్యేక అధికారి ఎస్.ఎస్. చంద్రశేఖర ఆజాద్, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు
దేవకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
దేవకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.శ్రీ కాళహస్తి దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం వారు ఈ రోజు రాత్రి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు సాయిప్రసాద్, కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమములో శ్రీకాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం ప్రధానార్చకులు కరుణాకర్ గురుకుల్, సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారియం. శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు, వేదపండితులు, శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు.
అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు మరియు వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేశారు.
ఉచిత బస్సు సదుపాయం”
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు.
భక్తులు సౌకర్యార్థం వారు దిగినచోటు నుంచి ఆయా ప్రదేశాలు వెళ్ళేందుకు దేవస్థానం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది.
ఈ బస్సులు కైలాస ద్వారం నుండి శ్రీశైలం వరకు నడపబడుతున్నాయి. అదేవిధంగా నందిగుడి సర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠం జంక్షన్, మల్లమ్మకన్నీరు, శివాజీస్ఫూర్తికేంద్రం, రుద్రాపార్కు, సిద్ధరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేటు సత్రాల మీదుగా మరల నందిగుడి సర్కిల్‌కు చేరుకుంటాయి.
కాగా భక్తులరద్దీని బట్టి ఈ రోజు నాలుగు బస్సులు నడిపారు.
09.02.2026 న కూడా నాలుగు బస్సులను నడుపుతారు.
అదేవిధంగా ఈ నెల 10 , 11 తేదీలలో రోజుకు ఎనిమిది బస్సులు నడుపుతారు.
12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రోజుకు 10 బస్సులను నడుపుతారు.
బ్రహ్మోత్సవాలలో నాలుగురోజులపాటు లడ్డుప్రసాద వితరణ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నాలుగురోజులపాటు భక్తులందరికీ కూడా ఉచితంగా లడ్డు ప్రసాదాలను అందజేయడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనిసవాసరావు సంయుక్తంగా తెలియజేశారు.
ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 16వరకు శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనానంతరం ప్రతీ భక్తుడికి కూడా ఉచితంగా 50 గ్రాముల లడ్డు అందజేయబడుతుందన్నారు. శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునే ప్రతీ భక్తుడికి లడ్డు ప్రసాదం అందాలనే భావనతో ఈ ఉచిత ప్రసాద వితరణ చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారి ఆలయ వెనుకభాగంలో ఈ లడ్డుప్రసాదవితరణ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
కాగా ఈ నెల 3వ తేదీన మంత్రుల బృందం మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రదేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం శాఖ మంత్రి శ్రీమతి వి. అనిత, రోడ్లు భవనాల, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్థనరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిర్ణయించిన మేరకు గత సంవత్సరం వలనే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదాలను అందజేయడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు , కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు. ఒక్కొక్క భక్తుడికి 50 గ్రాముల బరువుగల లడ్డ ప్రసాదం ఇవ్వడం జరుగుతుందన్నారు.
శీఘ్ర, అతిశీఘ్రదర్శన టికెట్టుదారులకు ఉచిత లడ్డు ప్రసాదం తాత్కాలికంగా నిలుపుదల :
కాగా ప్రస్తుతం రూ. 500/-ల రుసుమముతో స్పర్శదర్శనం భక్తులకు రెండు లడ్డు ప్రసాదాలు, రూ. 150/-లతో కూడిన శీఘ్రదర్శనం భక్తులకు ఒకలడ్డు ప్రసాదం ఉచితంగా అందజేయడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు. అయితే ఈ బ్రహ్మోత్సవాలలో ఎప్పటి వలనే శీఘ్రదర్శనం టికెట్టు రూ. 200/-లు, అతిశీఘ్రదర్శనం రూ. 500/-లుగాను మార్పు చేయడం జరిగిందన్నారు. భక్తులరద్దీ కారణంగా 30 కౌంటర్లలో లడ్డు విక్రయకేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులరద్దీ కారణంగా మొత్తం 30 లడ్డు విక్రయకేంద్రాలలో నిర్వహించవలసి వున్నందున శీఘ్ర, అతిశీఘ్ర దర్శన భక్తుల ఉచిత లడ్డు ప్రసాద వితరణ బ్రహ్మోత్సవాలలో తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లుగా పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం శీఘ్ర, అతిశీఘ్రదర్శనం టికెట్లకు యథావిధిగా ఉచిత లడ్డు ప్రసాదాలు అందజేయబడుతాయని తెలిపారు.
