శ్రీశైల దేవస్థానం:
శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 8 నుండి 18 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను ఆహ్వానించారు. శనివారం, ముఖ్యమంత్రిని దేవస్థానం వారు కలిశారు.
శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డారాజశేఖరరెడ్డి, దేవదాయ కమిషనరు కె.రామచంద్రమోహన్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి ని కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం తరుపున ఆహ్వానించారు.
దేవస్థానం ప్రచురించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందించారు.
ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపిక అందించారు.
మంత్రి నారా లోకేశ్ కు ఆహ్వానం:
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి , ఐ.టీ, శాఖల మంత్రి నారా లోకేశ్ ను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులుపొతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వేదపండితులు మంత్రిని కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రికి వేదాశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలను అందించారు.
స్థానిక శాసనసభ్యులకు ఆహ్వానం:
శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డికి ఆహ్వాన పత్రికను అందించారు.ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పొతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి యం.హరిదాసు వేదపండితులు, ప్రధానార్చకులు కలిసి ఆహ్వానించారు. వేద ఆశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు.
ప్రారంభమైన మహాశివరాత్రి శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ:
మహాశివరాత్రి శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం శనివారం ఉదయం ప్రారంభమైంది.
భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 22 తేదీ వరకు దీక్షా విరమణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
జనవరి 8వ తేదీన శివమండల దీక్షను, జనవరి28 తేదీన అర్థ మండల దీక్షను స్వీకరించిన భక్తులు ఈ దీక్షా విరమణ సమయంలో జ్యోతిర్ముడిని ( ఇరుముడిని) సమర్పిస్తారు.
ఈ జ్యోతిర్ముడి సమర్పణను పురస్కరించుకుని శనివారం ఉదయం మనోహర గుండం వద్ద శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి విశేష పూజాదికాలు జరిపించారు.
తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లను రథవీధిలో మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి శివదీక్షా శిబిరాలలో వేంచేపు చేయించారు.
అనంతరం దీక్షా శిబిరాలలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారాలతో పూజాదికాలు నిర్వహించారు. శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం పూర్తి అయ్యేంతవరకు కూడా శిబిరాలలోని దేవతా మూర్తులకు త్రికాలాలలో శాస్త్రోక్తంగా పూజాదికాలు వుంటాయి.
అనంతరం దీక్షా శిబిరాలలోని హోమగుండానికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలను జరిపించి హోమాగ్నిని ప్రజ్వలింపజేశారు. తరువాత శివదీక్షాధారులు నమశ్శివాయ పంచాక్షరీ నామస్మరణతో శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో జ్యోతిర్ముడి సమర్పణానంతరం ఆవునెయ్యి, నారికేళం మొదలుగాగల ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా భక్తులు సమర్పిస్తారు.
కాగా శివదీక్షను స్వీకరించిన భక్తులకు చంద్రవతి కల్యాణ మండపం నుండి ఆలయ తూర్పు మాడవీధి ద్వారా ప్రత్యేకదర్శనము క్యూలైన్ ద్వారా నిర్ణీత వేళలలో స్వామివార్ల దర్శనం వుంటుంది . అధిక సంఖ్యలో దీక్షావిరమణ చేసే భక్తుల కోసం మూడు వంతులుగా పలువురు సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించారు. ఈ సిబ్బంది అంతా శివదీక్షా శిబిరాలలో నిరంతరం ప్రత్యేక విధులు నిర్వహిస్తారు.
కాగా మన పురాణాలలోను, వ్యావహారిక గాథల్లోనూ ఈ శివదీక్షా ప్రాశస్త్యం ఎంతగానో చెప్పబడింది.
చారిత్రకంగా కూడా ఈ శివదీక్షకు ఆధారాలు ఉండటం విశేషం. బాదామి చాళుక్య రాజైన రెండవ విక్రమాదిత్యుడు ఆంగ్లశకం 660 సంవత్సరంలో శివమండల దీక్షను స్వీకరించినట్లు గాను దీక్షను ఇచ్చిన శివగురువు సుదర్శనాచార్యునికి వంగూరు సీమలోని (నేటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా) ఇపరుంకల్ అనే గ్రామాన్ని గురుదక్షిణగా ఇచ్చినట్లుగాను, అలంపూరు మండలంలోని ఆముదాలపాడులో లభించిన విక్రమాదిత్యుని తామ్రశాసనం చెబుతోంది.
ఈ కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారి కె. వెంకటేశ్వరరావు, అర్చకులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు ఆహ్వానం:
కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు నంద్యాలలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ షెరాన్ ను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందించారు.
ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, సహాయ ప్రజా సంబంధాల అధికారి, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా కు ఆహ్వానం:
కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. శ్రీశైల దేవస్థానం పండితులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు



