11.10.2026, శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం.
శ్రీశైల క్షేత్రంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం (11.10.2026) వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబరు 20వ తేదీ వరకు పది రోజుల పాటు సాగే ఈ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది.
శాస్త్రోక్తంగా ఆలయ ప్రవేశం, యాగశాల పూజలు
ఉత్సవాల్లో భాగంగా ముందుగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు కాశీనాథ్ చిలువేరు, ప్రత్యేక ఆహ్వానితులు ఆకుల శ్రీనివాసులు, ప్రధానార్చకులు, స్థానాచార్యులు, వేదపండితులు మరియు అధికారులు సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, ఫలపుష్పాదులతో ఆలయ ప్రవేశం చేశారు.
అనంతరం ఉదయం 9.00 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం, గణపతి పూజ, దీక్షాసంకల్పం, కంకణపూజ, కంకణధారణ, ఋత్విగ్వరణం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి యాగశాలలో అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, చండీకలశస్థాపన, శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు, నవగ్రహజపాలు, చతుర్వేద పారాయణలు జరిగాయి. అదేవిధంగా స్వామివారి యాగశాలలో శివసంకల్పం, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశస్థాపన తదితర వైదిక కార్యక్రమాలను పూర్తి చేశారు.
లోకకల్యాణం కోసం ప్రత్యేక యాగం
ప్రపంచ శాంతి, లోకకల్యాణం కొరకు అతివృష్టి, అనావృష్టి నివారించబడి వర్షాలు సమృద్ధిగా కురవాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఉత్సవ సంకల్పం చెప్పారు. ఈ సంవత్సరం మహోత్సవాలలో భాగంగా మొట్టమొదటిసారిగా ‘సహస్ర చండీపారాయణ సహిత శతచండీ మహారుద్రయాగం’ నిర్వహించడం విశేషం. దీనితో పాటు రుద్రహోమం, చండీహోమం, కుమారి పూజలు, చండీసప్తశతి, మహావిద్యా పారాయణలు మరియు సూర్యనమస్కారాలు జరిగాయి.
శైలపుత్రి అలంకారం – భృంగివాహన సేవ
సాయంత్రం యాగశాలలో అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవదుర్గ అలంకారాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ అమ్మవారు ‘శైలపుత్రి’ స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో పద్మం ధరించిన ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సర్వత్రా విజయాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై వేంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు. భృంగివాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులను దర్శించుకుని భక్తులు తారకమంత్ర స్మరణతో మురిసిపోయారు.

