శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం
తేది: 09.10.2026
తేది: 09.10.2026
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు అక్టోబర్ 11 నుండి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర ఉత్సవాలు అక్టోబర్ 20వ తేదీ వరకు పదకొండు రోజుల పాటు కొనసాగుతాయని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి (ఈవో) యం.శ్రీనివాసరావు తెలిపారు.
భక్తులు ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా ఎల్.ఈ.డి (LED) స్క్రీన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక పూజలు మరియు యాగాలు
ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ శ్రీస్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు, రుద్రయాగం, చండీయాగం నిర్వహించనున్నారు. లోకకల్యాణం కోసం ఈ సంవత్సరం ప్రత్యేకంగా సహస్ర చండీ పారాయణ సహిత శతచండీ మహారుద్రయాగం నిర్వహిస్తున్నారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు, లోకకల్యాణం కోసం జపపారాయణలు జరగనున్నాయి.
రేపటి (11.10.2026) ముఖ్య కార్యక్రమాలు
ఉత్సవాలకు నాందిగా అక్టోబర్ 11న నిర్వహించే కార్యక్రమాల వివరాలు:
-
ఉదయం గం. 9.00 నుండి: శ్రీఅమ్మవారి ఆలయ యాగశాలా ప్రవేశం, వేదస్వస్తి, ఉత్సవసంకల్పం, గణపతిపూజ, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణధారణ, అఖండదీప స్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, చండీకలశస్థాపన, శ్రీచక్రార్చన, నవగ్రహ జపాలు, చతుర్వేద పారాయణలు, చండీసప్తశతి పారాయణ, మహావిద్యా పారాయణ, సూర్యనమస్కారాలు, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు, కుమారీ పూజలు.
-
ఉదయం గం. 10.00 నుండి: శ్రీస్వామివారి ఆలయ యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణధారణ, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన, రుద్రకలశస్థాపన, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం.
-
ఉదయం గం. 11.00: మధ్యాహ్నకాలార్చనలు, మహానివేదన.
-
సాయంత్రం గం. 4.30: సాయంకాలపూజలు, గణపతి, రుద్ర, చండీ, లలితాపారాయణలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, నవావరణార్చనలు.
-
సాయంత్రం గం. 5.30: రుద్రహోమం, చండీహోమం.
-
రాత్రి గం. 6.30: శ్రీఅమ్మవారికి శైలపుత్రి అలంకారం, శ్రీస్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ మరియు గ్రామోత్సవం.
-
రాత్రి గం. 9.00: సువాసినీపూజ, నీరాజన మంత్రపుష్పములు, అమ్మవారి ఆస్థానసేవ.
-
రాత్రి గం. 10.00: కాళరాత్రిపూజ.
ప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాలు
దసరా మహోత్సవాలలో భాగంగా అక్టోబర్ 19న మహర్నవమి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఉత్సవాలలో దినవారీ అలంకారాలు – వాహనసేవలు
| తేది | వారం | అమ్మవారి అలంకారం | వాహనసేవ / విశేషం |
| 11.10.2026 | పాడ్యమి – ఆదివారం | శైలపుత్రి | భృంగివాహనసేవ |
| 12.10.2026 | విదియ – సోమవారం | బ్రహ్మచారిణి | మయూరవాహనసేవ |
| 13.10.2026 | తదియ – మంగళవారం | చంద్రఘంట | రావణవాహనసేవ |
| 14.10.2026 | చవితి – బుధవారం | కూష్మాండదుర్గ | కైలాసవాహనసేవ |
| 15.10.2026 | పంచమి – గురువారం | స్కందమాత | శేషవాహనసేవ |
| 16.10.2026 | షష్ఠి – శుక్రవారం | కాత్యాయని | హంసవాహనసేవ, పుష్పపల్లకీసేవ |
| 17.10.2026 | సప్తమి – శనివారం | కాళరాత్రి | గజవాహనసేవ |
| 18.10.2026 | అష్టమి – ఆదివారం | మహాగౌరి | నందివాహనసేవ |
| 19.10.2026 | అష్టమి-నవమి – సోమవారం | సిద్ధిదాయిని | కైలాస వాహనసేవ |
| 20.10.2026 | నవమి-దశమి – మంగళవారం | శ్రీభ్రమరాంబాదేవి | నందివాహనసేవ (ఆలయ ఉత్సవం), శమీపూజ, తెప్పోత్సవం |
(శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు జారీ చేయబడింది)
