శ్రీశైల దేవస్థానం:నవంబరు 10వ నుంచి డిసెంబరు 9 వరకు కార్తీక మాసోత్సవాల సందర్భంగా
శుక్రవారం సాయంత్రం పాతాళగంగ వద్ద కృష్ణమ్మ హారతి కార్యక్రమం జరిగింది.
పాతాళగంగ వద్ద కృష్ణవేణి నదీమతల్లి విగ్రహానికి పూజాదికాలు, వస్త్ర సమర్పణ తదితర కార్యక్రమాలు జరిపించారు.
పాతాళగంగ ఘాట్ వద్ద శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజాదికాలు, ఏకాదశ హారతులు సమర్పించారు. నదీమతల్లికి పూజాదికాలు, సారె సమర్పణ, దశహారతులను అర్పించారు.
ముందు, లోకకల్యాణాన్నికాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని తరువాత కార్యక్రమము నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
సంప్రదాయాన్ని అనుసరించి నదీమతల్లికి హారతులు ఇచ్చారు.
దశహారతులు – దర్శనఫలం
1. ఓంకారహారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం.
ఈ ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడతాయి. సకల శుభాలు కలుగుతాయి.
2. నాగహారతి : ఈ నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది.
3. త్రిశూలహారతి : ఈ త్రిశూలహారతిని దర్శించడం వలన అపమృత్యువు అంటే అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి.
4. నందిహారతి : ఈ నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండవు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి.
5. సింహహారతి : ఈ సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనో ధైర్యం కలుగుతుంది.
6. సూర్య హారతి : ఈ సూర్య హారతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది.
7. చంద్రహారతి : ఈ చంద్రహారతి దర్శించడం వలన మనశ్శుద్ధి కలిగి, ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
8. కుంభహారతి : ఈ కుంభహారతిని దర్శించడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి.
9. నక్షత్రహారతి : ఈ నక్షత్రహారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది.
10. కర్పూరహారతి : ఈ కర్పూరహారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు జి. లక్ష్మేశ్వరి, అర్చకస్వాములు, వేదపండితులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
