శ్రీశైల దేవస్థానం:
సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో దేవస్థానం నిర్వహిస్తున్న వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం 7 న ప్రారంభవుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు ,,కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 7వ తేదీ ఉదయం గణపతిపూజ, ఋత్విగ్వరణం, ఋష్యశృంగజపం, వారుణానువాక పారాయణలు, వరుణజపం, భాగవత, విరాటపర్వపారాయణలు, పంచాక్షరి జపం వుంటాయని తెలిపారు.
కాగా ఈ కార్యక్రమములో దేవస్థానం అర్చక స్వాములు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రానున్న సుమారు 36 మంది ఋత్వికులు కూడా ఆయా కార్యక్రమాలలో పాల్గొంటారని చెప్పారు.
అదేవిధంగా 8వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు ప్రతీరోజు ఋష్యశృంగజపం, వారుణానువాక పారాయణలు, వరుణజపం, భాగవత, విరాటపర్వపారాయణలు, పంచాక్షరి జపం చేస్తారని తెలిపారు.
అలాగే 9వ తేదీ విశేష కార్యక్రమాలలో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహావాచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, కంకణధారణ, ఋత్విగ్వరణం, అఖండస్థాపన, రుద్ర,చండీ కలశస్థాపనలు, మండపారాధనలు, ఘటశుద్ధి, ఘటాలంకారములు, రుద్రపారాయణలు వుంటాయని పేర్కొన్నారు.
అదేవిధంగా సాయంత్రం అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపన, రుద్రహోమం, ఉపాంగదేవతాహవనాలు, జపాంగహవనాలు, ఏకాదశ రుద్ర ఋష్యశృంగ సహిత సహస్రఘటస్థాపన, కలశార్చనలు, రుద్రపారాయణలు వుంటాయని తెలిపారు.
కాగా 10వ తేదీ ఉదయం ఏకాదశ రుద్ర ఋష్యశృంగ సహిత సహస్రఘటార్చన, మహాన్యాసపారాయణలు, రుద్ర, కాఠక, శతానువాక పారాయణ, వేదపారయణలు, వారుణానువాక సహిత ఋష్యశృంగపారాయణ, రుద్రహోమం, చండీపారాయణ, శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేషకుంకుమార్చనలు చేస్తారని పేర్కొన్నారు.
ఉదయం గం.7.00లకు నదీపూజ, పుణ్యనదీజలాలతో పాతాళేశ్వరస్వామివారికి, నందీశ్వరస్వామి వారికి, అంకాళమ్మవారికి, బయలువీరభద్రస్వామివారికి అభిషేకం చేస్తారని పేర్కొన్నారు.
అనంతరం ప్రధాన ఘటాలతో ఆలయ ప్రదక్షిణ, శ్రీ మల్లికార్జునస్వామివారికి పంచామృతాభిషేకం, ప్రధాన ఘటాభిషేకం, సహస్రఘటాభిషేకం చేస్తారని వివరించారు.
11 వతేదీన పూర్ణాహుతి, కలశోద్వాసనతో వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ముగుస్తుందని తెలిపారు.
