హైదరాబాద్, జూన్ 22 : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సహకారంతో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో అవగాహన సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తరఫున బి. చెన్నయ్య, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ , ఐటీ మేనేజర్ పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై సమగ్ర వివరణ అందించారు.ఈ సందర్భంగా వారు ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఉద్దేశ్యం, అర్హులైన ఓటర్ల నమోదు, వివరాల సవరణ, మార్పులు, తొలగింపులు, ఇంటింటి సర్వే తదితర అంశాలపై విపులంగా వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఎస్.ఐ.ఆర్కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాల ప్రాధాన్యత ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. జర్నలిస్టులు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై సమగ్ర అవగాహన పెంపొందించుకుని ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలని సూచించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమం జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరంగా, సమాచారపూర్వకంగా సాగింది.
ఈ కార్యక్రమంలో నాగులపల్లి వెంకటేశ్వరరావు, కార్యదర్శి, తెలంగాణ మీడియా అకాడమీ, వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.
