శ్రీశైల దేవస్థానం:
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా మే 11వ తేదీన దేవస్థానంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలియజేశారు.
సోమనాథ ఆలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు , దాని పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరున పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర దేవదాయశాఖ ఉత్తర్వుల మేరకు మే 11వ తేదీన శ్రీశైల దేవస్థానంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈసందర్భంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఇందులో భాగంగానే మే 11 వ తేదీన ఉదయం గం. 7.00ల నుంచి గంగాధర మండపం వద్ద కలశయాత్ర ఉంటుందన్నారు. గంగాధర మండపం ప్రారంభమయ్యే ఈ కలశయాత్ర నందిమండపం వరకు, అక్కడి నుంచి మల్లికార్జునసదన్ మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు , అక్కడి నుంచి తిరిగి గంగాధర మండపం వరకు ఈ కలశయాత్ర నిర్వహించబడుతుందన్నారు. అనంతరం పంచాక్షరీ మంత్ర లేఖనానికి భక్తులకు పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్నారు. తరువాత గంగాధర మండపం వద్ద గల ఏర్పాటు చేయనున్న వేదికపై గం. 10.00లకు ఎల్.ఈ.డి స్క్రీన్ లో జాతీయ కార్యక్రమ ప్రదర్శన ఉంటుందన్నారు.
కాగా సాయంకాలం గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేయనున్న వేదిక వద్దనే గం.5.30ల నుంచి శివభజనలు, భక్తిరంజని కార్యక్రమాలు ఉంటాయన్నారు. తరువాత సాయంత్రం గం. 6.30లకు ఓంకారం ప్రాశస్త్యంపై ధార్మిక ప్రవచనం అనంతరం ఓంకార మంత్ర జపం ఉంటుందన్నారు. కార్యక్రమం అనంతరం రాత్రి గం. 7.30ల నుంచి పేరిణి శివతాండవం ప్రదర్శన ఉంటుందన్నారు.
భక్తులందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు , కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.
