*తెలంగాణలో రూ. 894 కోట్ల విలువైన పంట దిగుబడిని
కనీస మద్దతు ధరతో సేకరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి
రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026 రబీ సీజన్‌కు గాను తెలంగాణలో మొత్తం 1,25,855 మెట్రిక్ టన్నుల పంటను కనీస మద్దతు ధర వద్ద సేకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర వ్యవసాయ- రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు.
ఈ పంటల సేకరణను ధర మద్దతు పథకం (పీఎస్ఎస్- ప్రైజ్ సపోర్ట్ స్కీమ్) కింద చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 29,860 మెట్రిక్ టన్నుల శనగలు.. 37,020 మెట్రిక్ టన్నుల మినుములు.. 55,285 మెట్రిక్ టన్నుల వేరుశనగ.. 3,690 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు కొనుగోలు చేయనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదించిన ఈ సేకరణ మొత్తం విలువ 894 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది.
రైతులను మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షించి వారి కష్టానికి తగిన పూర్తి ధర లభించేలా చూడటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ ఆమోదం వల్ల తెలంగాణ రైతులు పంటకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తికి కొత్త ఉత్తేజం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ప్రతి రైతు చేసిన కష్టానికి తగిన గౌరవం, విలువ దక్కాలన్నదే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రైతులు ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదని.. తద్వారా వారికి అటు ఊరట ఇటు ఆర్థిక భద్రత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో శనగలు, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసే రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగంలో స్థిరత్వం, భద్రత, సమృద్ధికి ఒక కొత్త దిశను నిర్దేశిస్తుంది.-PIB Hyderabad
