-జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, ఫిబ్రవరి 28:-
శ్రీశైలంలో మార్చి 16 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఉగాది ఉత్సవాలను ఘనంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె ఉత్సవ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారని కలెక్టర్ తెలిపారు. గత సంవత్సరం సుమారు 7 లక్షల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో రద్దీ ఉండే అవకాశమున్నందున ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. మార్చి 2వ తేదీ నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు.
త్రాగునీరు – వైద్య సదుపాయాలు:
భక్తులకు సమృద్ధిగా త్రాగునీరు అందించేందుకు రోజుకు 4 నుంచి 5 లక్షల నీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలని ఆదేశించారు. మార్చి 8వ తేదీ నుంచి ప్రధాన ప్రదేశాలు, పార్కింగ్ స్థలాలు, పాదయాత్ర మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రొటేషన్ పద్ధతిలో వైద్యులను అందుబాటులో ఉంచాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. బయో మెడికల్ వ్యర్థాలను ప్రత్యేకంగా రెడ్ కలర్ డస్ట్బిన్లలో సేకరించి తక్షణం నిర్వహించాలని సూచించారు.
పారిశుద్ధ్యం – మౌలిక వసతులు:
ఆర్డబ్ల్యుఎస్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. భక్తులు వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను నిర్దిష్ట ప్రదేశాల్లో సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆలయ ఈఓను ఆదేశించారు. గాలివానలు వచ్చినా షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు దృఢంగా ఉండేలా ఆర్ అండ్ బి శాఖ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. విద్యుత్ తీగలు వేలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పార్కింగ్ – ట్రాఫిక్ నిర్వహణ:
పార్కింగ్ ప్రదేశాల్లో తగినంత వెలుతురు, త్రాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు వాహనాలు మొరాయించినపుడు తరలించేందుకు క్రేన్లు, టోయింగ్ వాహనాలు మెకానిక్స్తో సహా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. లింగాలగట్టు, పాతాళగంగా ప్రాంతాల్లో ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని మత్స్య శాఖకు సూచించారు.
భక్తుల సౌకర్యం – భాషా సేవలు:
తెలుగు, కన్నడ భక్తుల కోసం ‘మే ఐ హెల్ప్ యూ’ డెస్క్లను పెంచాలని, ముఖ్యంగా కన్నడ భక్తులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కన్నడలోనూ ప్రకటనలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయించకుండా పర్యవేక్షణ చేయాలని, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
దర్శన ఏర్పాట్లు:
రోజుకు 8,000 నుంచి 10,000 మందికి స్లాట్ విధానంలో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఒక్కో స్లాట్ రెండు గంటల పాటు ఉండగా, మొత్తం ఎనిమిది గంటలు స్లాట్ దర్శనం నిర్వహిస్తారు. మిగిలిన సమయంలో ఉచిత దర్శనం కొనసాగుతుంది. స్పర్శ దర్శనం ప్రారంభానికి గంటన్నర ముందే ఉచిత దర్శనం క్యూ లైన్లను ఖాళీ చేసేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాల వివరాలు డిస్ప్లే బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. పార్కింగ్ నిర్వహణ, విద్యుత్ భద్రత, టోల్ మినహాయింపు (మార్చి 16–19 వరకు), పాతాళగంగా బోటు సేవలలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. భక్తుల రద్దీని బట్టి 6వ తేదీ నుంచి వాలంటీర్లను నియమించే అంశంపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కర్ణాటక, అనంతపురం ప్రాంతాల నుంచి వాలంటీర్లను సమీకరించనున్నట్లు చెప్పారు. కన్నడ భాష తెలిసిన పోలీసు సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి రప్పించేందుకు ఇప్పటికే లేఖ రాసినట్లు వెల్లడించారు.
ఆత్మకూరు అటవీ శాఖ డిడి విఘ్నేష్ అపూర్వ మాట్లాడుతూ అటవీ ప్రాంతాల గుండా వచ్చే పాదయాత్ర మార్గాల్లో ఫైర్ వాచర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన పాయింట్ల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతకుముందు దేవస్థాన ఈఓ శ్రీనివాస రావు ఉగాది ఉత్సవాల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రామునాయక్, ఆర్డీఓలు, డిఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
